Bharat, Us
Russia, US talks with India : ఓవైపు అప్ఘానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో బిజీబిజీగా ఉంటే.. మరోవైపు అక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రపంచదేశాలు… ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చలు జరపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, రష్యా తాజాగా భారత్‌తో ఉన్నతస్థాయి చర్చలు జరిపింది. రష్యా సెక్రటరీ జనరల్ నికోలాయ్ పాత్రుషేవ్… జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో భేటీ అయ్యారు. అఫ్ఘాన్‌లోని ప్రస్తుత పరిణామాలతోపాటు భవిష్యత్‌లో ఆ దేశంతో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇరుదేశాలు చర్చలు జరిపాయి. మరోవైపు. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తోనూ రష్యా సెక్రటరీ జనరల్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.
అటు అమెరికా సైతం భారత్‌తో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఢిల్లీలో అడుగుపెట్టిన CIA చీఫ్ విలియం బర్న్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం కూడా అజిత్ ధోవల్ తో భేటీ అయింది. తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఉత్పన్నంకానున్న అనేక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అమెరికా… ఇటు భారత్‌తో పాటు పాకిస్తాన్‌తోను చర్చలు జరపనుంది. ఇందుకోసం CIA చీఫ్ విలియం బర్న్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం పాక్‌కు వెళ్లనుంది.
అఫ్ఘాన్ పరిణామాలు వేగంగా మారిపోవడంతోపాటు అక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాటయింది. ఇక పాలనను పరుగులు పెట్టించడమే తరువాయిగా ఉంది. ఈ తరుణంలో వారి పాలన ఎలా ఉండబోతుందన్న భయం ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా తాలిబన్ల కేబినెట్‌లో ఉగ్రవాదులుండటం అగ్రదేశాలను ఆలోచనలో పడేస్తోంది. ఈ విషయంలో అమెరికా, రష్యా మల్లగుల్లాలు పడుతున్నాయి. దీంతో అఫ్ఘాన్ తాజా పరిస్థితులు, భవిష్యత్‌లో తలెత్తే పరిణామాలపై భారత్‌తో ఉన్నతస్థాయి చర్చలు జరుపుతున్నాయి.
కొత్తగా ఏర్పడిన తాలిబన్ల ప్రభుత్వంలో తాలిబనేతరులకు, మహిళలకు స్థానం కల్పించలేదు. పైగా.. పేరుమోసిన ఉగ్రవాదులకు స్థానం కల్పించారు. అందులోను సిరాజుద్దీన్ హక్కానీకి చోటివ్వడం అందరినీ నివ్వెరపరుస్తోంది. అమెరికా అతడిపై 37 కోట్ల రూపాయల రివార్డును ప్రకటించి ఉంది.
ఇదే ఇపుడు అగ్రదేశంతోపాటు అన్నిదేశాల ఆందోళనకు కారణమైంది. కొత్త తరహా పాలన అందిస్తామని తాలిబన్లు మాటలు చెబుతున్నా… చేతలు చూస్తుంటే మాత్రం వారి పాలన పాత తరహాలోనే కొనసాగుతుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. అందుకే.. రష్యా, అమెరికా ప్రతినిధులు భారత్ తో చర్చలు జరుపుతున్నారు.