putin phone call to kim jong un: యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య మూడేళ్లుగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చి.. వార్‌కు ఎండ్ కార్డు వేసేందుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin) తో ఆయన భేటీ కానున్నారు.
Also Read: “బాబ్బాబు.. ప్లీజ్”.. నిన్న బెదిరించి.. ఇవాళ భారత్‌ను అడుక్కుంటున్న పాక్..
ఆగస్టు 15వ తేదీన అలాస్కా వేదికగా పుతిన్, ట్రంప్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రష్యా – యుక్రెయిన్‌ల మధ్య కచ్చితంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ట్రంప్‌తో భేటీ వేళ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (North Korea President Kim Jong Un) తో పుతిన్ ఫోన్లో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉత్తర కొరియా అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. తమ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు ధృడంగా నిశ్చయించుకున్నారని తెలిపింది. ఈ సందర్భంగా యుక్రెయిన్‌తో యుద్ధానికి సైనికులను పంపినందుకు కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. కుర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో ఉత్తర కొరియా సైనికుల సహకారం చాలా ఉందని పుతిన్ చెప్పినట్లు ఆ దేశ అధికారిక మీడియా పేర్కొంది. అదేవిధంగా ట్రంప్‌తో భేటీకి సంబంధించిన వివరాలను తమ అధ్యక్షుడు కిమ్ తో పంచుకున్నారని రష్యన్ మీడియా తెలిపింది. ఇరువురు దేశాధ్యక్షులు తమ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని, భవిష్యత్తులో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఈ ఫోన్ సంభాషణలో నిర్ణయించినట్లు తెలిపింది.
24 సంవత్సరాల తర్వాత తొలిసారి గతేడాది ఉత్తర కొరియాకు పుతిన్ వెళ్లారు. గతేడాది జూన్ నెలలో ప్యోంగ్యాంగ్‌ను సందర్శించిన సమయంలో.. ఇరు దేశాలపై దాడి జరిగితే తక్షణ సైనిక సహాయం అందించాలనే ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఒప్పందాన్ని ఇద్దరు నాయకులు పునరుద్ధరించారు. ఆ సమయంలో పుతిన్ కూడా కిమ్‌ను మాస్కోను సందర్శించాలని ఆహ్వానించారు.
ట్రంప్ తో భేటీ సమయంలో పుతిన్, కిమ్ ఫోన్లో మాట్లాడుకోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే, ట్రంప్ తో భేటీ నేపథ్యంలో యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న దొనెట్స్కోలోని మిగిలిన 30శాతం భూభాగాన్ని తమకు అప్పగించాలని పుతిన్ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని అన్నారు. అలా చేస్తే భవిష్యత్తులో రష్యా దాడులకు ఆ ప్రాంతం కీలకంగా మారుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ భేటీలో యుక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న వార్‌కు ట్రంప్ ఏ విధంగా ఎండ్ కార్డు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.