Salmonella Bacteria : ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్​లో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’..ఉత్పత్తి నిలిపివేత

ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్​లో 'సాల్మొనెల్లా బ్యాక్టీరియా' బయటపడింది. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు.

Salmonella Bacteria in worlds largest chocolate factory : బెల్జియం వైజ్‌లోని స్విస్ దిగ్గజం బారీ కాల్‌బాట్ గ్రూప్‌ నిర్వహణలో ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్​లో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’ బయటపడింది. సదరు కంపెనీ గురువారం (జూన్ 30,6,2022) ఈ విషయాన్ని వెల్లడించింది. లిక్విడ్ చాక్లెట్‌ను ఉత్పత్తి చేసే ఈ కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేశారు. తదుపరి నోటీసు వెలువడే వరకు చాక్లెట్స్ తయారీని నిలిపేసామని కంపెనీ ప్రతినిధి కోర్నీల్ వార్లోప్ వెల్లడించారు.

కాగా దక్షిణ బెల్జియం ఆర్లోన్‌లోని ఫెర్రెరో ఫ్యాక్టరీలో ఇదే తరహా సాల్మొనెల్లా కేసు బయటపడిన వారాల వ్యవధిలోనే ఈ విషయం వెలుగులోకి రావటం గమనించాల్సిన విషయం. ఈ ప్లాంట్‌.. 70కిపైగా కంపెనీలకు కోకో, చాక్లెట్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. వాటిలో హెర్షే, మోండెలెజ్, నెస్లే తదితర దిగ్గజ సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ఇక్కడి నుంచి లిక్విడ్‌ చాక్లెట్‌ డెలివరీ తీసుకున్న సంస్థలను కంపెనీ సంప్రదిస్తోంది.

జూన్ 25 నుంచి ఆ చాక్లెట్‌తో తయారు చేసిన ఉత్పత్తులను రవాణా చేయొద్దని కోరింది. నిజానికి చాలావరకు ఉత్పత్తులు పరిశ్రమలోనే ఉన్నాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక్కడ బ్యాక్టీరియా బయటపడటంతో బెల్జియం ఆహార భద్రత ఏజెన్సీ ‘ఏఎఫ్‌ఎస్‌సీఏ’ దర్యాప్తు ప్రారంభించింది.

కాగా..లిక్విడ్‌ చాక్లెట్‌ ఉత్పత్తి రంగంలో ‘బారీ కాలెబాట్‌’.. ప్రపంచ నంబర్ వన్ సంస్థగా పేరొందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.2 మిలియన్ టన్నుల ఉత్పత్తులు విక్రయించింది అంటే దీని సామర్ధ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా ఉత్పత్తి కేంద్రాలున్నాయి. వీటిలో 13 వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సాల్మొనెల్లా రకం బ్యాక్టీరియాతో ‘సాల్మొనెలోసిస్’ వ్యాధి ప్రబలుతుంది. ఇది సోకినవారిలో అతిసారం, జ్వరం, వాంతులు తదితర లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ‘సాల్మొనెల్లా టైఫీ’ రకం బ్యాక్టీరియాతో టైఫాయిడ్‌ బారిన పడే ప్రమాదం ఉంది.

 

ట్రెండింగ్ వార్తలు