20ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ అరేబియా యువరాజు ‘స్లీపింగ్ ప్రిన్స్’ మృతి.. అతని గురించి ఈ ఆశ్చర్యకరమైన విషయాలు..

సౌదీ అరేబియా రాజకుటుంబానికి చెందిన యువరాజు అల్-వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ‘స్లీపింగ్ ప్రిన్స్’ 20ఏళ్లుగా కోమాలో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కన్నుమూశాడు.

Alwaleed bin Khaled bin Talal

Saudi Sleeping Prince : సౌదీ అరేబియా రాజకుటుంబానికి చెందిన యువరాజు అల్-వలీద్ బిన్ ఖలీద్ బిన్ ‘స్లీపింగ్ ప్రిన్స్’ 20ఏళ్లుగా కోమాలో ఉంటున్న విషయం తెలిసిందే. 2025లో లండన్‌లో జరిగిన కారు ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉంటున్నాడు. తాజాగా.. 36యేళ్ల అతను మరణించాడు. అతని తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ తన కొడుకు మరణ వార్తను ధృవీకరించారు.

ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ తన కుమారుడి (స్లీపింగ్ ప్రిన్స్) మరణం గురించి ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. ఆయన ఇలా రాశారు.. “అల్లాహ్ యొక్క ఆజ్ఞతో విశ్వాసం ఉన్న హృదయాలతో, లోతైన దుఃఖంతో మేము మా ప్రియమైన కుమారుడిని స్మరించుకుంటున్నాము.” అని పేర్కొన్నాడు. గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ (GIC) ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషాద ఘటన నుంచి ఆ కుటుంబం త్వరగా కోలుకునే ధైర్యం భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది.

ప్రిన్స్ అల్-వలీద్ ఎవరు? :
ప్రిన్స్ అల్-వలీద్ సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు రాజు అబ్దులాజీజ్ మునిమనవడు. ఆయన తండ్రి, ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్.. రాజు అబ్దులాజీజ్ కుమారుడు ప్రిన్స్ తలాల్ బిన్ అబ్దులాజీజ్ కుమారుడు. యువరాజు అల్-వలీద్ సౌదీ రాజకుటుంబానికి బంధువు. అయితే, ఆయన ప్రస్తుత రాజుకు ప్రత్యక్ష వారసుడు కాదు.

ప్రిన్స్ అల్-వలీద్‌కు ఏమైంది..?
ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖలీద్ లండన్ లో చదువుతున్నప్పుడు కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆ సమయంలో అతని మెదడుకు గాయమైంది. 2005లో ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు ఆయన వయస్సు 15యేళ్లు. అప్పటి నుంచి అతను కోమాలోనే ఉన్నాడు. అతన్ని రియాద్‌లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీకి తీసుకెళ్లి వెంటిలేటర్ పై ఉంచారు. అతని కుటుంబ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులను రప్పించి కోమా నుంచి ప్రిన్స్‌ను బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ప్రిన్స్ కోమా నుంచి బయటకు రాలేదు. దీంతో అతను ప్రపంచ వ్యాప్తంగా ‘స్లీపింగ్ ప్రిన్స్’ గా పేరుపొందాడు.

2019లో శరీర కదలికలు కనిపించినా.. :
ప్రిన్స్ అల్ -వలీద్ కోమాలోకి వెళ్లిన నాటినుంచి పలుసార్లు అతనిలో కదలికలు కనిపించాయి. చివరిసారిగా 2019లో ప్రిన్స్ శరీరంలో కదలికలు మొదలయ్యాయి. ఆయన చిన్న సైగలతో ఏదో మాట్లాడటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన వేలు పైకెత్తి తల కొద్దిగా ఊపాడు. కానీ, ప్రిన్స్ స్పృహలోకి వచ్చినందుకు సంకేతం కాదని వైద్యులు చెప్పారు. ఆ తరువాత కూడా అనేక మంది వైద్య నిపుణులు ప్రిన్స్ అల్-వలీద్ ను పరీక్షించారు. కానీ, కోమా నుంచి ప్రిన్స్ బయటపడలేదు. 20యేళ్ల కోమా అనంతరం శనివారం ఆయన తుదిశ్వాస విడిచాడు.