Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరపడానికి దుండగులు మరోసారి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దుండగులు హంటింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
ఆ హంటింగ్ స్టాండ్‌ను తాజాగా అధికారులు గుర్తించారు. దీన్ని కొన్ని నెలల క్రితమే దుండగులు ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని అధికారులు అంటున్నారు.
పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొనాల్డ్ ట్రంప్ వాడే ఎయిర్ ఫోర్స్ వన్ విమాన ప్రవేశద్వారాల సమీపంలోనే ఈ హంటింగ్ స్టాండ్‌ను గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ, యూఎస్ సీక్రెట్ సర్వీస్ (యూఎస్‌ఎస్‌ఎస్) అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
“అధ్యక్షుడు వెస్ట్ పామ్ బీచ్‌కు రాకముందు, యూఎస్‌ఎస్‌ఎస్ అధికారులు ఎయిర్ ఫోర్స్ వన్ ల్యాండింగ్ ప్రదేశానికి కొద్ది దూరంలో ఎత్తైన హంటింగ్ స్టాండ్‌ను గుర్తించారు” అని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తాజాగా ఫాక్స్ న్యూస్ డిజిటల్‌కు చెప్పారు.
“అక్కడ ఎవరూ కనిపించలేదు. ఆ తర్వాత ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించి, ఆ ప్రదేశం నుంచి అన్ని ఆధారాలను సేకరిస్తోంది” అని అన్నారు.
సీక్రెట్ సర్వీస్ ఫాక్స్ న్యూస్‌కు అందించిన ఫొటోలో.. చెట్టు కొమ్మల్లో నేల మట్టానికి చాలా ఎత్తులో ఏర్పాటైన హంటింగ్ స్టాండ్ కనిపించింది. స్నైపర్లు ఇటువంటివి ఏర్పాటు చేసుకుంటారు.
ట్రంప్ పామ్ బీచ్ కౌంటీకి గురువారం రావడానికి ముందే ఆ ప్రాంతాన్ని యూఎస్‌ఎస్‌ఎస్ ఏజెంట్లు తనిఖీ చేయగా హంటింగ్ స్టాండ్ కనపడింది.
తుపాకీతో లక్ష్యాన్ని గురి పెట్టి కాల్చడానికి దుండగులు ఆ ఎత్తైన హంటింగ్ స్టాండ్‌ను ఏర్పాటు చేసుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. యూఎస్‌ఎస్‌ఎస్ భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా చర్యలు కఠినతరం చేయడంతో డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి.. దాని వెనుకవైపు ఉన్న చిన్న మెట్లద్వారా ఎక్కారని వైట్ హౌస్ తెలిపింది.
USSS spotted a suspicious stand near the AF1 zone in Palm Beach.
The FBI is investigating. pic.twitter.com/nMCoVP9mKB
— FBI Director Kash Patel (@FBIDirectorKash) October 19, 2025