Sheikh Hasina
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) కు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో కోర్టు ఈ నిర్ణయం వెలువరించింది. విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు వారిపై భీకర దాడులు చేయాలని షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. కొన్ని నెలల తరబడి దీనిపై విచారణ కొనసాగింది. ఆమెను మూడు ఆరోపణలపై కోర్టు దోషిగా గుర్తించింది.
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ విధించిన మరణ శిక్షణను ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని, న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్షపడేలా చేసిందని హసీనా ఆరోపించారు.
దేశంలో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధి వంటి విషయాల్లో తన హయాంలో ఎన్నో చర్యలు తీసుకున్నామని ఆమె గుర్తు చేశారు. మయన్మార్‌లో హింస చెలరేగడంతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామని, మానవ హక్కుల పట్ల శ్రద్ద లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తామని ఆమె ప్రశ్నించారు.
షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉంటున్నారు. 2024 ఆగస్టు 4న హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చారు. కమాల్ కూడా భారత్‌లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని ముహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం కోరింది. అందుకు భారత్ స్పందించలేదు. కోర్టు తీర్పుతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరోవైపు హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో బంగ్లాలోని అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.
Also Read; Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు.. మరొకరికి కూడా..