Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు.. మరొకరికి కూడా..
దేశవ్యాప్తంగా నిరసనకారులను చంపేందుకు ఈ ముగ్గురు కలిసి అమానుష చర్యలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది.
Sheikh Hasina
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా(78)కు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటును అణచివేసేందుకు వారిపై భీకర దాడులు చేయాలని షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. కొన్ని నెలల తరబడి దీనిపై విచారణ కొనసాగింది. ఆమెను మూడు ఆరోపణలపై కోర్టు దోషిగా గుర్తించింది.
జస్టిస్ మొహ్ద్ గోలామ్ మోర్టుజా మజుమ్దర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్ హసీనా సన్నిహితులైన మాజీ హోం మంత్రి అసదుజ్జామాన్ ఖాన్ కమాల్, మాజీ పోలీస్ చీఫ్ చౌధురి అబ్దుల్లా అల్ మమూన్ పై ఉన్న అభియోగాలపై కూడా తీర్పు ప్రకటించింది. (Sheikh Hasina)
దేశవ్యాప్తంగా నిరసనకారులను చంపేందుకు ఈ ముగ్గురు కలిసి అమానుష చర్యలకు పాల్పడినట్లు కోర్టు పేర్కొంది. ట్రైబ్యునల్, దేశ ప్రజలను క్షమాపణలు కోరినందుకు ఇక పోలీస్ చీఫ్‌ను శిక్షించకుండా కోర్టు వదిలేసింది.
Also Read: తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు 4 వారాల గడువు
హసీనా, కమాల్ పరారీలో ఉన్నారు కాబట్టి గైర్హాజరుగా విచారణ జరిపారు. మమూన్ విచారణకు ప్రారంభంలో హాజరయ్యారు. తరువాత అప్రూవర్‌గా మారారు.
విద్యార్థుల డిమాండ్లను హసీనా ప్రభుత్వం పట్టించుకోలేదని కోర్టు పేర్కొంది. విద్యార్థులను హేళన చేస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారని చెప్పింది. ఆ వ్యాఖ్యల తరువాత విద్యార్థులు, మహిళలు కోపంతో ఉగ్రరూపం దాల్చారని కోర్టు తెలిపింది. ఆ తరువాత నిరసన చేస్తున్న విద్యార్థులను అంతమొందించాలని హసీనా ఆదేశించారని కోర్టు తేల్చింది.
నిరసనకారులు ఉన్న ప్రదేశాలను కనుగొనటానికి డ్రోన్లు వాడాలని, వారిని చంపేందుకు హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలను వాడాలని షేక్ హసీనా ఆదేశించారని కోర్టు తెలిపింది. హసీనా “మూడు ఆరోపణలపై దోషి” అని కోర్టు తెలిపింది. రెచ్చగొట్టడం, హత్యలకు ఆదేశించడం, అఘాయిత్యాలను ఆపకపోవడంపై ఆమెకు ఒకే శిక్ష విధిస్తున్నామని, అదే మరణశిక్ష అని జడ్జి మోర్టుజా మోజుమ్దర్ ప్రకటించారు.
హసీనాపై ఆరోపణలు
హసీనా, కమాల్, మమూన్ పై ఐదు ఆరోపణలు ఉన్నాయి. హత్య, హత్యాయత్నం, హింస, అమానుష చర్యలు. వాటిలో అతి ముఖ్య ఆరోపణ.. నిరసనకారులను అంతమొందించాలని హసీనా ఆదేశించడం. 2024 ఆగస్టులో పెద్ద ఎత్తున విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయటానికి భీకర ఆయుధాలు వాడాలని ఆమె ఆదేశించారని విమర్శలు ఉన్నాయి. జూలై 15-ఆగస్టు 15 మధ్య ఉద్యమం సమయంలో 1,400 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది.
హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉంటున్నారు. 2024 ఆగస్టు 4న హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చారు. కమాల్ కూడా భారత్‌లోనే ఉన్నట్లు భావిస్తున్నారు. హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి పంపాలని ముహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం కోరింది. అందుకు భారత్ స్పందించలేదు. తీర్పు ముందు బంగ్లాదేశ్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
