South Africa
South Africa Omicron Wave : ప్రపంచ దేశాలు ఒమిక్రాన్‌తో వణికిపోతుండగా.. ఆ వేరియంట్ బయటపడిన దక్షిణాఫ్రికాలో మాత్రం కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా ఒమిక్రాన్ ప్రభావం ఏమంత తీవ్రంగా లేదని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదైనా వైరస్ లేదా వాటి వేరియంట్ల వ్యాప్తి శిఖరస్థాయికి చేరిన తర్వాత క్రమంగా తగ్గుకుంటూ వస్తుందంటున్నారు వైరాలజిస్టులు. అదే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతోందన్నారు. గత గురువారం దక్షిణాఫ్రికాలో 27వేల కొత్త కేసులు నమోదు కాగా, తాజాగా మంగళవారం ఆ సంఖ్య 15 వేల 424కు పడిపోయింది. కోటీ 60 లక్షల జనాభా ఉన్న గౌటెంగ్‌తోపాటు ఆ దేశంలోని అతిపెద్ద నగరం జోహెన్స్‌బర్గ్, రాజధాని ప్రిటోరియాలోనూ కేసులు తగ్గుముఖం పట్టాయి.
Read More : Shilpa Chowdhury : జైలు నుంచి విడుదలైన శిల్పాచౌదరి..షరతులు ఇవే
ఒమిక్రాన్ కేసులకు కొన్ని వారాలుగా కేంద్రంగా ఉన్న గౌటెంగ్‌లో కేసులు తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు అక్కడి పరిశోధకులు. నవంబర్‌లో ఒక్కసారిగా కేసులు భారీగా పెరగడం, ఇప్పుడు అంతే భారీగా తగ్గడం అంచనా వేయలేకపోయామంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌తో ఆస్పత్రుల్లో చేరికలు, మరణాల సంఖ్య కూడా తక్కువేనని తెలిపారు. గౌటెంగ్‌లో నవంబర్ మధ్యలో కేసులు పెరగగా వైరస్‌ను సీక్వెన్సింగ్‌కు పంపి ఈ వేరియంట్‌ను మొదట అక్కడే గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నవంబర్ 25న ఒమిక్రాన్‌గా దానికి నామకరణం చేస్తూ ఆందోళన కలిగిస్తోన్న వేరియంట్‌గా ప్రకటించింది.