South Korean President Yoon Suk Yeol
Southkorea: దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పై అభిశంసనను ఏకగ్రీవంగా సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. యూన్ పై అభిశంసనను ఎనిమిది మంది సభ్యులున్న రాజ్యాంగ కోర్టు బెంచ్ సమర్థించింది. దీంతో అతన్ని పదవి నుంచి తొలగించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ దేశంలో చట్టాల ప్రకారం.. 60 రోజులలోపు మళ్లీ అక్కడ అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో జూన్ నెలలో అధ్యక్ష ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన తరువాత యూన్ లాయర్లు ఆయన తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు సేవ చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నాకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ నేను కృతజ్ఞుడను. మీ అంచనాలను అందుకోలేక పోయినందుకు బాధగా ఉంది.. నన్ను క్షమించండి అంటూ పేర్కొన్నారు. దక్షిణ కొరియా రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అనంతరం యూన్ సుక్ యోల్ మద్దతుదారులు, వ్యతిరేకులు వీధుల్లోకి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే?
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ గతేడాది డిసెంబర్ లో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మర్షల్ లా విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రకటనను విరమించుకున్నాడు. మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 240 మంది ఓటేయగా.. కేవలం 85 మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు.
అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దానిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుసార్లు యూన్ సుక్ యోల్ కు సమన్లు జారీ చేశాడు. వాటికి స్పందించక పోవటంతో కోర్టును ఆశ్రయించగా అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ నేపథ్యంలో జనవరి 15వ తేదీన ఆయన్ను అరెస్టు చేశారు. గత నెలలో జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. యూన్ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన తరువాత తాత్కాలిక అధ్యక్షుడిగా హాన్ డక్ సూ బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా అభిశంసన ఎదుర్కొని పదవి నుంచి తొలగిపోవడంతో ఆర్థిక మంత్రి చోయ్ సంగ్ మాక్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.