గురువారం(ఏప్రిల్-16,2020)విడుదలైన దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఘన విజయం సాధించింది. కరోనా పోరాటంలో అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్పందనకు ప్రజల ఆమోదంగా ఈ విజయాన్ని చూడవచ్చు. దక్షిణ కొరియా జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకారం, మొత్తం 300మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో…అధికార డెమోక్రటిక్ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి 180స్థానాల్లో ఘన విజయం సాధించగా,ప్రతిపక్ష యునైటెడ్ ఫ్యూచర్ పార్టీ(UFP)కేవలం 103సీట్లలో మాత్రమే విజయం సాధించింది.
దేశంలోని మొత్తం 300 జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) స్థానాలకు 21 పార్టీలకు చెందిన 1,400 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. 1987లో దక్షిణ కొరియా ప్రజాస్వామ్యదేశంగా మారినప్పటినుంచి ఇప్పటివరకు జాతీయ అసెంబ్లీలో ఓ పార్టీ అతిపెద్ద మెజార్టీ సాధించడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా మరోరికార్డు కూడా ఈ ఎన్నికల్లో నమోదైంది. 1992నుంచి దక్షిణ కొరియాలో జరిగిన ఏ పార్లమెంటరీ ఎన్నికల్లో నమోదవని ఓటింగ్ శాతం ఈసారి నమోదైంది. ఈ ఎన్నికల్లో 66.2శాతం ఓటింగ్ నమోదైంది.
ఓవైపు ప్రపంచదేశాలన్నీ కరోనా భయంతో లాక్ డౌన్ లో ఉండిపోగా,దక్షిణకొరియా బుధవారం పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ నిర్వహించింది. లక్షలాదిమంది ప్రజలు మాస్క్ లు ధరించి,పోలింగ్ స్టేషన్ ల దగ్గర సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ ఓటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిపిన తొలిదేశంగా దక్షిణకొరియా నిలిచింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 47 దేశాలు ఎన్నికలను వాయిదావేశాయి.
కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అధికారపార్టీ వైపే ప్రజలు మొగ్గుచూపారని,దీంతో మరోసారి అధ్యక్షుడు మూన్ జే ఇన్ నేతృత్వంలోని అధికార డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియాకే ప్రజలు పట్టం కట్టారని విశ్లేషకులు అంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దక్షిణకొరియాలో లాక్‌డౌన్ కొనసాగుతున్నది. సౌత్ కొరియాలో ఇప్పటివరకు 10,613 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 229కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా,చైనా తర్వాత దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందిన విషయం తెలిసిందే. అయితే వెగంగా స్పందించిన దక్షిణకొరియా కరోనా కట్టడిలో ఘన విజయం సాధించిందనే చెప్పవచ్చు.
Also Read | లాక్ డౌన్ పరిష్కారం కాదు…కరోనాకి అతిపెద్ద ఆయుధం అదే : రాహుల్