Donald Trump : పెద్దన్న మాట అంటే.. పెదరాయుడి తీర్పే. అలాంటి దేశానికి రెండోసారి బిగ్ బాస్ అయ్యారు ట్రంప్. స్నేహం కుదర్చడం, స్నేహంగా ఉండటం అంటే ఏంటో తెలియని ట్రంప్.. రెండోసారి అధ్యక్షుడిగా యుద్ధాలు ఆపేస్తారా? ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానని చెప్పిన ట్రంప్ దగ్గర.. ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి. అసలాయన ఏమి చేయబోతున్నారు?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ ఉన్న దేశం. పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశం. అలాంటి అమెరికాకు అధ్యక్షుడు మారారంటే.. ప్రపంచవ్యాప్తంగా చాలా మారతాయి. రాజకీయం మారుతుంది, రాజీ పడాల్సిన పరిస్థితులు మారతాయి. ట్రంప్ విషయంలో ఇప్పుడు కనిపిస్తోంది అదే. ట్రంప్ విజయం ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలు చాలామందికి వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ విధానంలో పెను మార్పులు అవసరమని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు.
అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం, అంతర్జాతీయ ఒప్పందాలతో అమెరికాకు ఎదురయ్యే చిక్కులను తగ్గించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారని ఆయన చెబుతున్నారంటే.. వివిధ దేశాల్లోని వాణిజ్యం, వలసలు మాత్రమే కాదు.. సైనిక సహకారం, దౌత్యం లాంటి అంశాల్లో కూడా కీలక మార్పులు ఖాయంగా రాబోతున్నాయన్న సంకేతంగా చూడొచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచం అంతా యుద్ధంలో మునిగింది. దీంతో ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు ఏంటన్నది ఆసక్తి రేపుతోంది.
రష్యా యుక్రెయిన్ యుద్ధం ఓవైపు.. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు మరోవైపు.. కొరియాల కవ్వింపులు, చైనా తైవాన్ పంచాయితీ ఇంకోవైపు.. వీటన్నింటి మధ్య ప్రపంచాన్ని దట్టమైన యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి టఫ్ సిచుయేషన్ టైమ్ లో అమెరికాలో అధ్యక్షుడి మార్పు జరిగింది. మరి ఈ కొత్త ప్రెసిడెంట్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి. ప్రపంచ పెద్దన్నగా అమెరియా యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది అన్నది బిగ్ డిబేట్ గా మారింది.
యుద్ధం ఎవరైనా చేస్తారు. ఆపే వాడే అసలైన హీరో. ట్రంప్ అలాంటి హీరో అవుతాడా అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. యుద్ధాలు ఆపుతానంటున్నారు సరే.. అసలు చైనా, రష్యా దేశాలు పెద్దన్న మాట వింటాయా? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం ఎలా అన్న దానిపైనే క్లారిటీ లేదు. మరి పశ్చిమాసియాలో పరిస్థితులపైన అమెరికా స్టాండ్ ఎలా ఉండబోతోంది? ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..
Also Read : ట్రంప్ విజయం భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఏంటి?