World Rhino Day 2021 : ఖడ్గమృగాల గురించి ఆసక్తికర విషయాలు

సెప్టెంబర్ 22. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం. ఈ సందర్భంగా ఈ భారీ జంతువుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

World Rhino Day 2021: సెప్టెంబర్ 22. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం.ఖడ్గమృగం చూడటానికి చాలా భారీగా ఉంటుంది. కానీ పాపం ఇవి వేటగాళ్లకు బలైపోతున్నాయి. వీటి ముక్కుమీద ఉన్న పొడవాటి కొమ్ము వల్ల వీటి మనుగడ ప్రమాదకరంగా మారుతోంది. ఏదినోత్సవం అయినా వాటి ప్రత్యేకత గురించి వాటి సంరక్షణ గురించే జరుగుతుంది. ఇది కూడా అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖడ్గమృగాల గురించి వాటి సంరక్షణ గురించి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుని వాటిని అమలు చేయటానికి జరుపుకుంటున్నాం.

ఈ ఖడ్గమృగాల్లో ప్రధానంగా 5 రకాలున్నాయి, ఆఫ్రికాకు చెందిన బ్లాక్ అండ్ వైట్ ఖడ్గమృగాలు, ఒంటికొమ్మువి, ఆసియా… ఇండొనేసియాలోని సుమత్రా, జావాలో కనిపించేవి. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచ దేశాలు ఖడ్గమృగాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తాయి. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలో కనిపించే ఖడ్గ మృగాలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాయి.


ఆఫ్రికా, సుమత్రాకి చెందిన ఈ ఖడ్గ మృగాలకు రెండు కొమ్ములుంటాయి. కానీ ఇండియాలో ఉండే ఖడ్గమృగాలకు ఒకే కొమ్ము ఉంటుంది. ఆ కొమ్మే వాటి ప్రాణాలు తీస్తోంది. వాటి కొమ్ముతో ఔషధాలు తయారుచేస్తారనే ప్రచారంతో వీటిని వేటగాళ్లు వేటాడి వాటి కొమ్ములకు కోసుకుపోతుంటారు. 2010లో దక్షిణ ఆఫ్రికాలో వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని ప్రకటించగా..2011 నుంచి దీనికి గుర్తింపు వచ్చింది.

భారీ జంతువైనా శాఖాహారి..తెలివైనవి కూడా..
ఖడ్గమృగాలు పెద్దగా కదలవు. లేజీగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. బహుశా వాటి భారీ శరీరం వల్లనేమో. ఎక్కడ ఎక్కువ పచ్చగా కనిపిస్తే అక్కడే మేస్తు ఉంటాయి. ఈ భారీ జంతువులు భలే తెలివైనవికూడా. వీటి ముక్కు నుంచి పైకి ఓ కొమ్ము పెరుగుతుంది. అందువల్ల వీటిని రైనోసెరోస్ అంటారు. అంటే ముక్కు కొమ్ము అని. వెంట్రుకలే కొమ్ములా మారుతాయి. ఈ కొమ్ము చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ కొమ్మే దానికి ఆయుధం..భద్రతనిస్తుంది. ఈ కొమ్ము పొడిస్తే ఏనుగైనా గింగిరాలు తిరగాల్సిందే. అలాగే దీని శరీరం రాయిలాగా కనిపిస్తుంది. ముడతలు ముడతలుగా.


ప్రపంచంలోని పెద్ద జంతువుల్లో ఇవీ కూడా ఉన్నాయి. వీటిలో ఉండే ఐదు జాతుల్లో వైట్ రైనోలు చాలా భారీగా ఉంటాయి. ఇవి 1.8 మీటర్లు పొడవు పెరుగుతాయి. 2,500 కేజీల బరువుంటాయి. ఇవి శాఖాహారులు. గడ్డి, మొక్కలు పండ్లు తింటాయి. ఎండగా ఉంటే నీడనే ఉండటానికి ఇష్టపడతాయి. ఎందుకంటే ఎండను అవి భరించలేవు. అందుకే సూర్యాస్తమయం, రాత్రి అంటే చీకటి పడ్డాక మేత మేస్తుంటాయి. పగటివేళ ఎండ భరించలేవు. వేడిగా ఉంటుంది కాబట్టి పగటివేళ చక్కగా నిద్రపోతాయి. చల్లగా ఉండేలా బురద నీటిలో సేదతీరుతాయి. వీటికి బురద అంటే చాలా ఇష్టం. చల్లగా ఉంటుంది కాబట్టి.

ఏనుగా భారీగా ఉన్న ఒంటరిగానే ఉంటాయి..
ఏనుగులు గుంపులు గుంపులుగా నివసిస్తాయి. కానీ ఖడ్గమృగాలు అలా కాదు సాధ్యమైనంత వరకూ ఒంటరిగానే జీవిస్తాయి. కానీ విచిత్రంగా వీటిలో వైట్ రైనోలు మాత్రం గుంపులుగా జీవిస్తాయి. ఈ వైట్ రైనో గుంపుని క్రాష్ అంటారు. ఈ గుంపుల్లో ఆడ ఖడ్గమృగాలు, వాటి పిల్లలు కూడా ఉంటాయి. అలాగే గుంపులుగా ఉండే ఆడ రైనోల గుంపుని కౌస్ అంటారు. అదే మగ ఖడ్గమృగాల గుంపును బుల్స్ అంటారు. సంతానాన్ని వృద్ధి చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఖడ్గమృగాలు శారీరకంగా కలుస్తాయి. మిగతా సమయాల్లో వేటి దారి వాటిదే. వేటి జీవితాలు వాటివే అన్నట్లుగా ఉంటాయి.

ఖడ్గ మృగాల సరిహద్దులు…మూత్రం పోసి మరీ చెబుతాయి..
ఈ ఖడ్గమృగాలు భలే రూల్స్ పెట్టుకుంటాయి. ఇది నా ప్రాంతం అని చెప్పటానికి సరిహద్దులు పెట్టుకుంటాయి. ఈ ప్రదేశం నాది అని హెచ్చరించటానికి మూత్రాన్ని పోస్తాయి చెబుతాయి. ఆ మూత్రం గుర్తు పట్టి మరో ఖడ్గమృగం లోపలికి అడుగు కూడా పెట్టదు. అవి రూల్స్ బట్టే ఉంటాయి. రూల్స్ ని ఏమాత్రం అతిక్రమించవు. ఒక్కో ఖడ్గమృగం పేడ ఒక్కో రకమైన వాసన వస్తుంది. బహుశా అవి తినే ఆహారాన్ని బట్టి అలా వస్తుందేమో.

పక్షులంటే ఈ భారీ జంతువలకు భలే ఇష్టం..ఎందుకంటే..
మీరు ఖడ్గమృగాలను ఎప్పుడైనా గమనిస్తే వాటిమీద పక్షులు వాలి ఉండటం చూసే ఉంటారు. ఎందుకంటే ఖడ్గమృగాలకు పక్షులు అంటే చాలా ఇష్టమట. ఎందుకంటే వాటికోసమే. ఎందుకంటే అవే రైనోపై వాలే దోమలు, ఈగలు, పురుగుల్ని పక్షలు గుటుక్కుమనిపిస్తాయి. దీంతో వాటికి వేరే బాధ ఉండదు. అందువల్ల పక్షులు తమతో ఉంటే… దోమల గోల ఉండదని భావిస్తాయి. అందుకే పక్షులు వాటిపై వాలినా సవారీ తీసినా ఏమాత్రం పట్టించుకోవు.

Read more : World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం..జీవ వైవిధ్యంలో గజరాజులు

రైనోకి ఉండే చర్మం చాలా మొద్దుబారి ఉంటుంది. ఆ చర్మంలో చాలా పురుగులు దూరి ఉంటాయి. పురుగు అన్నాక కుదురుగా ఉండదుగా..అవి కదులుతుంటాయి. కుడుతు ఉంటాయి. వాటిని దులుపుకోవటానికి రైనో పెద్ద తోక కూడా ఉండదు. కాబట్టి పక్షుల సహాయం వీటికి బాగా కలిసొస్తుంది. దాంతో పక్షులకు ఆహారం దొరుకుతుంది. ఖడ్గమృగాలకు పురుగులు, దోమల బాధా తప్పుతుంది. పక్షుల వల్ల వీటికి మరో ఉపయోగం కూడా ఉంది.ఏదైనా క్రూరమృగం వీటివైపు వస్తే వాటిమీద వాలిన పక్షులు సిగ్నల్ ఇస్తాయి. అవి అరుస్తూ ఎగిరిపోతాయి. దీంతో పక్షులు అరుస్తూ ఎగిరిపోవటంతో ఖడ్గమృగాలు చుట్టుపక్కల చూసి తమకు హాని చేసే క్రూరమృగం వస్తుందని గుర్తించి అప్రమత్తమయి జాగ్రత్తపడతాయి.

చూడటానికి భారీగా ఉన్నా చాలా భయం..
రైనోలు చూడటానికి బలిష్టంగా ఉన్నా..ఇవి చాలా పిరికివి. భయం చాలా ఎక్కువ. వాటికి ప్రమాదం జరగకుండా ఇవి అన్ని జంతువులతో స్నేహంగా ఉంటాయి. దేనికీ హాని తలపెట్టవు. ఏదైనా క్రూరమృగాన్ని చూసి భయపడినప్పుడు… ఇక ప్రాణానికే ప్రమాదం అని అనిపిస్తే మాత్రం ఏమాత్రం తగ్గేదిలే..అన్నట్లుగా ఎదురుదాడికి రెడీ అయిపోతాయి. కానీ అటువంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఖడ్గమృగాలు అంత భారీగా ఉన్నాగానీ పరుగులో కూడా ఏమాత్రం తగ్గవు. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తి క్షణాల్లో కనిపించకుండాపోవటంలో ఇవి భలే దిట్ట.

Read more : World Rhino Day : 2,479 ఖడ్గమృగం కొమ్ములను తగులబెట్టిన అస్సాం సర్కార్

వీటి కొమ్ముల గురించి ఇవి వేటగాళ్లకు చిక్కి వీటి సంఖ్య తగ్గిపోతోంది. దీంతో వీటి సంఖ్య చాలా వేగంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో 29,000 ఖడ్గమృగాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీటి కొమ్ముల కోసం వీటిని అక్రమంగా వేటాడుతున్నారు. ఆసియా దేశాల్లో ఈ కొమ్ములను రకరకాల మందుల తయారీలో వాడుతున్నారు. కొమ్ముకోసం ప్రాణం తీస్తున్నారు. తమకు రక్షణగా ఉండే కొమ్ము లేకపోవడంతో… ఆ రైనోలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

ట్రెండింగ్ వార్తలు