World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం..జీవ వైవిధ్యంలో గజరాజులు

భూ గ్రహంపై అతిపెద్ద క్షీరదం ఏనుగుల జాతి. జీవ వైవిద్యానికి, పర్యావరణ పరిరక్షణలో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా సమస్త ప్రాణికోటి జీవించటానికి ఏనుగులు పరోక్షంగా సహాయం పడుతున్నాయి. అటువంటి ఏనుగుల జాతి పెను ప్రమాదంలో పడింది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా గజరాజుల గురించి ఎన్నో విశేషాలు..

World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం..జీవ వైవిధ్యంలో గజరాజులు

World Elephant Day

World Elephant Day 2021 : భూ గ్రహంపై అతిపెద్ద క్షీరదం ఏనుగుల జాతి. జీవ వైవిద్యానికి, పర్యావరణ పరిరక్షణలో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తద్వారా సమస్త ప్రాణికోటి జీవించటానికి ఏనుగులు పరోక్షంగా సహాయం పడుతున్నాయి. అటువంటి ఏనుగుల జాతి పెను ప్రమాదంలో పడింది. ఎంతోమంది స్వార్థపరుల దురాశలకు గజరాజులు అంతరించిపోతున్నాయి. ఏనుగు దంతాల కోసం వాటిని చంపేస్తున్నారు. దంతాల స్మగ్లింగ్ ముఠాల దారుణాలకు…ప్రకృతి విపత్తులకు గజరాజులు అంతరించిపోతున్నాయి.

జీవ వైవిద్యానికి, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర వహించే ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంది. అదే ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఏ దినోత్సవం అయినా సంరక్షణకు అవగాహనల కోసం ఏర్పాటు చేసిందే. అలాగే ప్రపంచ ఏనుగుల దినోత్సవం కూడా గజరాజుల సంరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించటం..వాటిని సంరక్షించటానికి తీసుకోవాల్సిన చర్యలు గురించే ఏర్పాటు అయ్యింది. పర్యావరణానికి ఏనుగు చేస్తున్న కృషి గురించి అవగాహన కల్పిస్తారు. ఏనుగుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు.

ఏనుగుల దినోత్సవం ఏర్పాటు..
2011లో కనజ్వెస్ట్ పిక్చర్స్‌ అనే సినీ నిర్మాణ సంస్థకు చెందిన కెనడియన్ సినీ నిర్మాతలు ప్యాట్రిసియా సిమ్స్, మైఖేల్ క్లార్క్, ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్‌లాండ్‌ సంస్థ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరనంద సంయుక్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతిపాదించారు.

2012లో సిమ్స్‌తో కలిసి ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అధికారికంగా మొదటిసారి ‘వరల్డ్ ఎలిఫెంట్‌ డే’ ను నిర్వహించింది. 2012 నుంచి ప్యాట్రిసియా సిమ్స్ ప్రపంచ ఏనుగుల దినోత్సవానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణి సంస్థలు, వివిధ దేశాలు, ఎంతో మంది ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రపంచ ఏనుగుల దినోత్సవం లక్ష్యం ఏంటీ..?
ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రధాన లక్ష్యం ఏనుగుల సంరక్షణకు చర్యలు చేపట్టడం..వాటి ఆవాసాలను కాపాడటం, ఏనుగుల అక్రమ వేటను నిరోధించటం, ఏనుగు దంతాల అక్రమ రవాణాను నిరోధించే చర్యలు చేపట్టడం ద్వారా వాటికి భద్రత, రక్షణ కల్పించడవంటి కార్యక్రమాలు చేపట్టం. బంధించి ఉంచిన ఏనుగులను అభయారణ్యాలలోకి విడిచిపెట్టటానికి కృషి చేయడం కూడా దీంట్లో భాగమే. అలాగే ఏనుగులు అడువులను వదిలి జనావాసాల్లోకి రాకుండా తీసుకోవటం కూడా దీంట్లో భాగమే.ఇటువంటివాటికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు.

జీవ వైవిధ్యంలో గజరాజుల పాత్ర..
ఏనుగులు జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి. ఏనుగులు గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఆహారం, నీరు, ఆవాసాల కోసం వెతుక్కుంటూ చాలా చాలా దూరం ప్రయాణిస్తాయి. ఈ క్రమంలో దట్టమైన చిట్టడవులను తొక్కుకుంటూ వెళ్తాయి. ఫలితంగా ఇతర అడవి జంతువులకు ప్రయాణ మార్గాలను క్రియేట్ చేస్తాయి. వివిధ రకాల పండ్లను తినే గజరాజులు సుదూర ప్రయాణాల్లో చాలాచోట్ల విత్తనాలను విసర్జిస్తాయి. ఫలితంగా కొత్త మొక్కలు మొలవటానికి కారణమవుతాయి. అడవుల పెరుగుదలకు ఏనుగులు ప్రత్యక్షంగా ఎంతగానో తోడ్పడతాయి.

అడవుల్లో ప్రయాణించేటప్పుడు ఏర్పడే ఏనుగుల పాదముద్రలు సైతం సూక్ష్మ పర్యావరణ వ్యవస్థగా పనిచేస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నీటితో నిండిన గజరాజుల పాదముద్రలు టాడ్‌పోల్స్, వివిధ రకాల చిన్న కీటకాలకు ఆవాసాలుగా మారుతాయట. అందువల్ల పర్యావరణానికి అన్ని విధాలుగా మేలు చేసే ఏనుగులను సంరక్షించడం వల్ల ఇతర జీవ జాతులను కూడా కాపాడినట్లే..