సొరంగంలో పట్టాలు తప్పిన రైలు..51మంది మృతి

తైవాన్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

Taiwan train తైవాన్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 9:28గంటల సమయంలో తూర్పు తైవాన్‌లోని హౌలైన్ సిటీకి సమీపంలోని ఓ సొరంగంలో రైలు పట్టాలు తప్పి ఇరుక్కుపోయింది. కొండ ప్రాంతంలోని మార్గం నుంచి ఓ కారు సొరంగ మార్గం ముందున్న రైల్వే పట్టాలపై పడింది. దీంతో పట్టాలపై ఉన్న కారును రైలు ఢీ కొట్టి సొరంగంలోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో రైలు సగ భాగం సొరంగంలోకెళ్లి ఆగిపోయింది.

350 మంది ప్రయాణికులతో ఈ రైలు టైటంగ్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైలు డ్రైవర్ తో సహా 51 మంది చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. 75 మంది వరకు గాయపడ్డారు. గాయపడినవారిని హాస్పిటల్ కి తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంకా చాలా మంది ప్రయాణికులు సొరంగంలోనే చిక్కుకుని ఉన్నారని తైవాన్ అధ్యక్షుడు చెప్పారు.

ప్రస్తుతం సొరంగ మార్గంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రైలు సగభాగం సొరంగంలోకి వెళ్లాక పట్టాలు తప్పడం వల్ల లోపలికి చేరుకోవడం సహాయక బృందాలకు కష్టతరంగా మారింది. తైవాన్ లో మూడు దశాబ్దాల తరువాత జరిగిన అతిపెద్ద ప్రమాదంగా రైల్వే అధికారులు చెప్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో రైలులోని ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడిపోయారని ప్రమాదం నుంచి బయటపడిన ఒక మహిళ చెప్పారు. ఇది భయంకరమైన ఘటన అని ఆమె తెలిపారు. బయటపడేందుకు అద్దాలు పగలగొట్టుకుని రైలు పైకి వెళ్లడానికి ప్రయత్నించామని మరికొందరు ప్రయాణికులు తెలిపారు.

T3

ట్రెండింగ్ వార్తలు