Afghanistan
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తున్న తాలిబన్లు దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్ ను కూడా వశం చేసుకున్నారు. ఈ మేరకు తాలిబన్లు శుక్రవారం ప్రకటించడంతో ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తాలిబన్ల ఆక్రమణలతో ఇక ప్రభుత్వ ఆధీనంలో కేవలం రాజధాని కాబూల్, మరో ప్రావిన్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. 11 ప్రావిన్సుల రాజధానులను ఆక్రమించుకోగా దీంతో దేశంలో మూడింట రెండొంతుల భాగం తాలిబన్ల చెరలోకి వెళ్లినట్లయింది.
తాలిబన్లను ఎదుర్కోవడం ఆఫ్ఘన్ సాయుధ బలగాల వల్ల కావడం లేదు. పరిమితంగా ఉన్న అమెరికా సైన్యం అక్కడక్కడా వైమానిక దాడులు జరుపుతున్నప్పటికీ తాలిబన్లను నిలువరించలేకపోతున్నాయి. ఇప్పటికే రాజధాని కాబూల్, మరో ప్రధాన నగరం కాందహార్ మధ్య హైవేపై ఉన్న ఘజినీ నగరం కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోగా.. దక్షిణ ప్రావిన్సులతో రాజధానికి సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్లు హింసకు స్వస్తి చెప్తే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
అయితే, అష్రాఫ్ ఘానీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ఇప్పటికే తాలిబన్ అధికార ప్రతినిధి సొహెయిల్ స్పష్టం చేశారు. ఘానీ సర్కార్‌కు తాము ఎన్నటికీ లొంగేది లేదని తేల్చి చెప్పారు. సెప్టెంబరు 11 నాటికి తమ దేశ బలగాలు తిరిగి స్వదేశానికి వచేస్తాయంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించిన అనంతరం ఆఫ్ఘన్ లో తాలిబన్ల దూకుడు మరింత పెరిగిన సంగతి తెలిసిందే. జైలులో ఖైదీలుగా ఉన్న అనేకమందిని విడిపించుకుని తమ సైన్యాన్ని మరింతగా పెంచుకున్న తాలిబన్ల దూకుడుకు ఇక్కడి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరై చేతులెత్తేసింది.