Taliban
Taliban Open Fire : తాలిబన్లు మేక వన్నె పులులే అని తేలిపోయింది. శాంతి మంత్రాలు వల్లించిన క్రూర జంతువులే అని వారి చర్యలే తెలియచేస్తున్నాయి. కాబూల్ ఆక్రమణ తర్వాత శాంతి.. శాంతి అంటూ చేసిన ప్రకటనలను పరిమితం చేస్తూ.. తమ సహజ ధోరణిని ప్రదర్శిస్తున్నారు ముష్కరులు. శాంతియుత ప్రదర్శనలు చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. మహిళల హక్కులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన వారు.. 24 గంటలు గడవకముందే వారిపై అమానుషత్వాన్ని ప్రదర్శించారు. అందరికీ క్షమాభిక్ష అంటూ సాధు సంతువుల్లా ప్రవచనాలు వల్లించి.. కాబూల్ ఎయిర్‌పోర్టులో ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిపై విరుచుకుపడ్డారు. స్వేచ్ఛ కోసం జెండా ఎత్తిన వారి శరీరాల్లోకి తూటాలు దింపారు.
Read More : Corona Vaccination : 7 వేలమందికి కరోనా టీకా మూడవ డోస్
దేశ ప్రజలందరినీ క్షమిస్తున్నామని.. ఎవ్వరినీ ఏమీ చేయబోయని ప్రకటనలిచ్చిన తాలిబన్లు.. కనీసం 24 గంటలు కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి లేరు. తాలిబన్ల అరాచకాలకు బలవ్వకూడదన్న ఉద్దేశంతో దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ విమానాశ్రయానికి వచ్చిన వారితో ముష్కరులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు. ఇష్టానుసారం వారిని పదునైన ఆయుధాలతో కొట్టారు. మహిళలు, పిల్లలు అని కూడా చూడకుండా వారి కర్కశత్వాన్ని ప్రదర్శించారు. జలాలాబాద్‌లోనూ తాలిబన్లు అరాచకం సృష్టించారు. తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తున్న స్థానికులు జలాలాబాద్‌లో ఆందోళనకు దిగారు.
Read More : Nithyananda:మదురై శైవ మఠంపై కన్నేసిన నిత్యానంద..నేనే పీఠాధిపతిని అంటూ ప్రకటన
తాలిబన్ల జెండాలు తొలగించి అప్ఘాన్ జెండాలు ఎగరవేయాలని డిమాండ్ చేస్తూ.. జలాలాబాద్ వీధుల్లో శాంతియుత ప్రదర్శన చేస్తున్న వారిపై ముష్కరులు విరుచుకుపడ్డారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 12 మందికి పైగా గాయపడ్డారు. కాల్పుల మోతతో జలాలాబాద్ దద్దరిల్లింది. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఘటనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపైనా దాడికి దిగారు తాలిబన్లు. తాలిబన్లు ప్రజలనే కాదు.. విగ్రహాలనూ వదిలిపెట్టడం లేదు. ముష్కరులకు వ్యతిరేకంగా పోరాడిన వారి ఆనవాళ్లను లేకుండా చేస్తున్నారు.
Read More :Peanuts : శనగలో కొత్త వంగడం…అధిక దిగుబడి సాధ్యం
బమియాన్ ప్రావిన్సులో ఉన్న ప్రముఖ షియా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని పేల్చేశారు. అబ్దుల్ మజారీ.. హజారా తెగకు చెందిన నాయకుడు. 1990ల్లో జరిగిన అఫ్ఘాన్ అంతర్యుద్ధంలో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడిన మజారీని.. వారు 1996లో చంపేశారు. ఇప్పుడు మజారీ విగ్రహాన్ని కూల్చేశారు. గతంలో తాలిబన్లు బమియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారు. తాలిబన్లు పైకి మంచిగా మాట్లాడుతున్నప్పటికీ వారిని నమ్మలేమంటున్న అఫ్ఘాన్ల భయాలను నిజమని తెలిపేలా ఈ ఘటనలు జరుగుతున్నాయి.