Nithyananda:మదురై శైవ మఠంపై కన్నేసిన నిత్యానంద..నేనే పీఠాధిపతిని అంటూ ప్రకటన

ఓ వివాదాస్పద విచిత్ర స్వామి నిత్యానందస్వామి మరోసారి వార్తల్లోకెక్కారు. మధురైలోని శైవమఠానికి 293వ పీఠాధిపతిని నేనే నంటు ప్రకటించుకోవటం వివాదంగా మారింది

Nithyananda:మదురై శైవ మఠంపై కన్నేసిన నిత్యానంద..నేనే పీఠాధిపతిని అంటూ ప్రకటన

Nithyananda Swamy

Updated On : August 19, 2021 / 11:35 AM IST

Nithyananda Swamy : నిత్యానంద. ఈపేరు వింటేనే వివాదాలు గుర్తుకొస్తాయి. ఆయన ఆశ్రమంలో జరిగిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఆ తరువాత కనుమరుగైపోయిన నిత్యానంద కైలాసం అనే దేశాన్ని నిర్మించి మరోసారి హల్ చల్ చేశారు. ఆ దేశానికి ఓ ప్రత్యేక కరెన్సీని కూడా క్రియేట్ చేశారు. ఈ క్రమంలో మరోసారి వార్తల్లోకెక్కారు వివాదాల గురువు నిత్యానంద. మదురైలో శైవ మఠంపై ఆయన గారి కన్ను పడింది. ఆ మఠానికి తానే పీఠాధిపతిని అంటూ తనను తానే స్వయంగా ప్రకటన చేయటం ఇప్పుడు మరో సంచలనంగా మారింది. మధురై పీఠం విషయమై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మధురై పీఠంపై నిత్యానంద కన్నేయడం చర్చనీయాంశమవుతోంది.

నిత్యానందస్వామి. ఓ వివాదాస్పద విచిత్ర స్వామి. చాలాకాలంగా వార్తలకు దూరంగా ఉన్న నిత్యానంద మధురైలోని ప్రసిద్ధి చెందిన శైవమఠానికి 293వ ఆధీనంగా బాధ్యతలు స్వీకరించినట్టు నిత్యానంద ప్రకటించారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. నిత్యానందపై ఆరోపణల అనంతరం జరిగిన పలు నాటకీయ పరిణామాలతో దేశం విడిచి వెళ్లిపోయారు. సొంతంగా కైలాస దేశం స్థాపించానని ప్రకటించుకున్నారు. అంతేకాదు ఆ దేశానికి ఓ కరెన్సీ, వీసా కూడా ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పుడు హఠాత్తుగా మరోసారి తెరపైకి వచ్చి ప్రకటనలతో హల్ చల్ చేస్తున్నారు. మధురై పీఠం బాధ్యతలు తీసుకున్నట్టు ప్రకటించడం వివాదంగా మారింది. తాను కైలాసదేశం నుంచే ఆన్‌లైన్ ద్వారా భక్తులకు ఆశీస్సులు అందిస్తానని తెలిపారు. తన పేరును కూడ జగద్గురు మహాసన్నిధానం శ్రీలశ్రీభగవాన్ నిత్యానంద పరమశివజ్ఞాన సంబంధ దేశిక పరమాచార్య స్వామిగా మార్చుకున్నట్టు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించారు.

కాగా మధురై శైవమఠానికి కొన్ని దశాబ్దాలపాటు 292వ మఠాధిపతిగా సేవలందించిన అరుణ గిరినాధర్ గత వారమే శివైక్యం పొందడంతో నిత్యానంద ఆ పీఠంపై తనను తాను అధిపతిగా ప్రకటించేసుకున్నారు.

అరుణ గిరినాధర్ పార్ధీవదేహాన్ని మహాసమాధి చేసిన తరువాత అదే మఠంలో 5 వందల కేజీలతో అరుణ గిరినాధర్ పాలరాతి శిల్పం ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. 293వ ఆధీనంగా హరిహర జ్ఞాన సంబంధం దేశీయ పరమాచార్య బాధ్యతలు చేపట్టారు. ఈ మఠం రహస్యగదిలోని ఆభరణాలు, విలువైన వజ్రాలు, మధురై పీఠం ఆస్థుల దస్తావేజుల్ని 293వ ఆధీనానికి అప్పగించారు. అయినా సరే నేనే పీఠాధిపతినని ప్రకటించుకోవడం వివాదానికి దారి తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మదురై మఠానికి ఉన్న ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను ధర్మపురం ఆధీనం సమక్షంలో 293వ ఆధీనానికి అప్పగించారు. అయితే మఠాన్ని కైవశం చేసుకునేందుకు వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్లీ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఆ మఠానికి చెందిన విలువైన ఆస్తులపై నిత్యానంద కన్ను పడటమే ఈ ప్రకటనకు కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి.