‘Are You Dead?’.. కొత్త యాప్.. పిచ్చ పిచ్చగా డౌన్‌లోడ్ చేస్తున్న జనం.. డబ్బులు ఎదురిచ్చి..
Are You Dead app : ఆర్ యూ డెడ్ యాప్‌ను మనిషి ఉన్నాడా? పోయాడా అనే క్షేమ సమాచారాన్ని తెలియజేయడానికి వాడతారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రతి రెండు రోజులకు ఒకసారి బటన్ ప్రెస్ చేయాలి.
Are You Dead app
- చైనాలో సంచలనం సృష్టిస్తున్న ‘ఆర్ యూ డెడ్’ యాప్
- ఒంటరిగా జీవించే వారికి స్పెషల్ యాప్
- డబ్బులు ఇచ్చి డౌన్‌లోడ్ చేసుకుంటున్న చైనా ప్రజలు
Are You Dead App : ఆర్ యూ డెడ్?.. ఈ వాక్యం చూడగానే ‘ఉన్నావా? పోయావా?’ అనే అర్థం వస్తుంది కదా. ఔను. ఈ యాప్ కూడా అంతే. దాని ఉద్దేశం కూడా ఇదే. నువ్వు ఉన్నావా? పోయావా? అనే సమాచారాన్ని మీ వాళ్లకు తెలియజేస్తుందన్నమాట. ఈ యాప్‌ను కనిపెట్టింది చైనాలో. అక్కడ జెంఝువా అనే సిటీలో ఓ ముగ్గురు కుర్రాళ్లు సుమారు 1000 యువాన్‌లు (భారత కరెన్సీలో సుమారు రూ.13000) ఖర్చు పెట్టి ఈ యాప్‌కు రూపకల్పన చేశారు.
అసలు ఈ యాప్ ఎందుకు వాడతారు?
పేరులోనే చెప్పినట్టు ఈ యాప్ మనిషి ఉన్నాడా? పోయాడా అనే క్షేమ సమాచారాన్ని తెలియజేయడానికి వాడతారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ప్రతి రెండు రోజులకు ఒకసారి బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఆ పర్సన్ బతికే ఉన్నట్టుగా ఆ యాప్ గుర్తిస్తుంది. ఒకవేళ రెండు రోజుల తర్వాత కూడా వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే అందులో ముందే ఫీడ్ చేసిన ఎమర్జెన్సీ నెంబర్స్ కు అలర్ట్స్ పంపుతుంది.
యాప్‌ను వాడే వాళ్లు ఎవరు?
అసలు ఇలాంటి యాప్‌ను ఎవరు వాడతారు? అని మీరు అనుకుంటే మీరు నూడుల్స్ లో కాలేసినట్టే. ఎందుకంటే 2030 నాటికి చైనాలో సుమారు 20కోట్ల మంది సింగల్ పర్సన్స్ ఉంటారని నివేదికలు చెబుతున్నాయి. అంటే వారిలో ఇంటికి దూరంగా ఉండి చదువుకునే స్టూడెంట్స్ కావొచ్చు. కుటుంబాలకు దూరంగా జాబ్స్ చేసుకునే వాళ్లు కావొచ్చు. నాక్కొంచెం స్పేస్ కావాలి అని సమాజానికి దూరంగా ఉండాలనుకునే వారికి కావొచ్చు.. ఇలా రకరకాలైన జనం ఈ యాప్‌ను వాడుతున్నారు.
టాప్ పెయిడ్ యాప్..
మూన్ స్పేస్ టెక్నాలజీస్ అనే సంస్థ 2025లో ఈ యాప్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఆ తర్వాత సూపర్ ఫాస్ట్‌గా డెవలప్ అయింది. జనం పిచ్చి పిచ్చిగా డౌన్ లోడ్స్ చేస్తున్నారు. చైనాలో ప్రస్తుతం ఇదే టాప్ పెయిడ్ యాప్. దీన్ని డబ్బులు కట్టి మరీ వాడుకుంటున్నారు జనం. అయితే, ఈ పేరుకో చిన్న లాజిక్ ఉంది. చైనాలో ఆర్ యూ హంగ్రీ అనే ఫుడ్ యాప్ ఉంది. అక్కడ ఫుల్ ఫేమస్. ఆ పేరుని అటూ ఇటూ తిప్పి ఆర్ యూ డెడ్? అని పెట్టారు.
నెక్ట్స్ మరో కొత్త యాప్..
ఒక్క చైనాలోనే కాదు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఈ యాప్ బాగా డౌన్ లోడ్స్ అవుతుంది. అమెరికా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, స్పెయిన్ లాంటి దేశాల్లో ఉండే చైనీయులు దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అయితే, దీని పేరు మీద మాత్రం జనాల్లో కొంత అసంతృప్తి ఉంది. దీన్ని పేరు మార్చే ప్లాన్ లో ఉన్నారు. ఈ యాప్ సక్సెస్ అయిన తర్వాత మరో కొత్త యాప్ తేవడానికి కంపెనీ ప్లాన్ చేసుకుంటోంది. ఈసారి వృద్ధుల కోసం యాప్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే చైనాలో ఆరింట ఒక వంతు జనం 60 ఏళ్ల పైబడిన వారే.
13వేల పెట్టుబడి.. 13 కోట్ల విలువ..
ఈ కంపెనీ పెట్టడానికి వాళ్లకి అయిన ఖర్చు కేవలం రూ.13000 మాత్రమే. దీని డౌన్ లోడ్స్ పెరిగాయి. ఆదాయం పెరిగింది. దీంతో మార్కెట్ విలువ కూడా పెరిగింది. సుమారు 13 కోట్ల రూపాయలకి మార్కెట్ విలువ చేరుకుంది. అందులో ఓ 10శాతం వాటా అమ్మి ఓ రూ.1.30 కోట్లు పెట్టుబడి తీసుకుని యాప్ ని మరింత డెవలప్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తోంది.
