తెలుగమ్మాయి ఘనత : US ప్రొగ్రామ్‌కు ఎంపిక

  • Publish Date - January 13, 2019 / 05:17 AM IST

పట్టుదల, ప్రతిభ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. పేదరికం కూడా అడ్డు కాదు. దీన్ని ప్రూవ్ చేసింది తెలంగాణ అమ్మాయి. పేదింటి అమ్మాయి అయినా అసమాన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. అరుదైన ఘనత సాధించింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్టాత్మకమైన YES(Youth Exchange Scheme) ప్ర్రొగ్రామ్‌కు జనగామకు చెందిన అదితి సెలెక్ట్ అయ్యింది. ఎంతో మందితో పోటీ పడి అమెరికా సంస్కృతి, సంప్రదాయాలపై అధ్యయనం చేసే ‘ఎస్‌’ ప్రోగ్రాంకు ఎంపికై శెభాష్ అనిపించుకుంది.

అదితి గొప్పింటి అమ్మాయి కాదు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చింది. జనగామ పట్టణంలోని గణేశ్‌వాడకు చెందిన కొకొండ మురళి, మాధవిల పెద్దమ్మాయే అదితి. ఆమె ఇద్దరు చెల్లెల్లు. మురళి నగల షాపులో పనిచేస్తాడు. మాధవి కూలి పని చేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తమ పిల్లల చదువుకు మురళి దంపతులు ఏమాత్రం వెనకాడలేదు. వాళ్ల కష్టానికి తగ్గట్లు అదితి చదువులో ముందు ఉండేది. 2017లో 10వ తరగతిలో 9.0 జీపీఏ సాధించి, పాలకుర్తిలోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో అడ్మిషన్‌ సాధించింది. అక్కడ చదువు కొనసాగిస్తూనే యూత్‌ ఎక్స్చేంజ్‌ స్కీం (ఎస్‌ ప్రోగ్రాం)కు దరఖాస్తు చేసుకుంది. ఎన్నో కఠినమైన పరీక్షలు, ఇంటర్వ్యూలను ఎదుర్కొంది. పరీక్ష రాసిన వేలాది మందిని వెనక్కి నెట్టి.. ఏడాది పాటు అమెరికా సంస్కృతి, సంప్రదాయాలపై పరిశోధన, అధ్యయనం చేయడానికి వెళ్లింది. అదితి సాధించిన ఘనత ఆమె తల్లిదండ్రుల్లో తోటు జనగామ వాసుల్లో ఆనందం నింపింది.

తన లక్ష్యం ఐఏఎస్ అని అదితి తెలిపింది. తనతో పాటు తన ఇద్దరు చెల్లెళ్లను చదివించడానికి అమ్మానాన్నలు చాలా కష్టపడుతున్నారని, త్వరలో మంచి ఉద్యోగం సంపాదించి వారిని కంటికి రెప్పలా చూసుకుంటనని అదితి చెప్పింది. తాను అమెరికా వెళ్లడానికి గురుకులాల సంస్థ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ కారణం అని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది. కాలేజీ టీచర్ కూడా తనకు చాలా సహకరించారంది.