Icon of the Seas
World Biggest Cruise Ship : సముద్ర అలలపై తేలిపోతూ వినోద భరిత విలాసవంతమైన ప్రయాణాలు చేయాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ‘ఐకాన్ ఆఫ్ ది సీస్’ తాజాగా సముద్ర ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. (Biggest Cruise Ship began the sea trials) టైటానిక్ కంటే ఐదు రెట్లు పెద్దదైన ఈ నౌకలో సముద్ర ప్రయాణం చేయాలనుకుంటే వచ్చే ఏడాది జనవరి వరకు ఆగాల్సిందే. జూన్ నెలలో మొదటి విడత ట్రయల్ రన్‌ను ఈ విలాసవంతమైన నౌక పూర్తి చేసుకుంది.
ఐకాన్ ఆఫ్ ది సీస్ భారీ క్రూయిజ్ షిప్
ఫిన్‌లాండ్‌లోని టర్కులోని నౌకానిర్మాణ సంస్థల్లో ఒకటైన మేయర్ టర్కు షిప్‌యార్డ్‌లో నిర్మించారు. రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ సంస్థ (Royal Caribbean International) ఐకాన్ ఆఫ్ ది సీస్ భారీ క్రూయిజ్ షిప్ ను(Icon of the Seas) నిర్మించింది. 2024వ సంవత్సరంలో జనవరి నెలలో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న ఈ భారీ నౌక ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అవుతుందని భావిస్తున్నారు.
అత్యంత అధునాతన 28 రకాల వసతి సౌకర్యాలు
ఈ ఓడలో అత్యంత అధునాతన 28 రకాల వసతి సౌకర్యాలతో పర్యాటకులకు వినూత్న అనుభూతి ఇవ్వనుంది. నౌకలోని రాయల్ లాఫ్ట్ సూట్ లో రెండు బెడ్రూంలు, డైనింగ్ ఏరియా, హాట్ టబ్, టెర్రస్, బేబీ గ్రాండ్ పియానోతో కూడిన లివింగ్ రూంలున్నాయి. ఓడలో అవుట్ డోర్ రిలాక్సేషన్ జోన్ రాయల్ కరేబియన్ క్రూయిజ్ లైనర్ లున్నాయి. నౌకలో ఉన్న సన్‌సెట్ కార్నర్ సూట్ అద్భుతమైన సముద్ర వీక్షణ అనుభూతిని పర్యాటకులకు అందించనుంది.
వినోదభరితంగా క్రూయిజ్ షిప్ ప్రయాణం
థ్రిల్ ఐలాండ్, అడ్వెంచర్ జోన్ వాటర్ పార్క్, రాక్ క్లైంబింగ్ వాల్, మినీ గోల్ఫ్ కోర్స్, క్రౌన్స్ ఎడ్జ్ ఉన్నాయి. సేఫ్టీ జీను ధరించి సముద్రం మీదుగా పర్యటకులు నడవవచ్చు. ఓడ ముందు భాగంలో ఉన్న పెద్ద గ్లాసు నిర్మాణం సముద్రపు దృశ్యాలను పర్యాటకులు ఆస్వాదించడానికి ఉద్ధేశించారు. సాయంత్రంవేళ ఇది వినోద వేదికగా ఉపయోగపడనుంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ ఓడలో పర్యాటకులు భోజనం చేయడానికి, మద్యం తాగడానికి, వినోదం కోసం 40 కంటే ఎక్కువ మార్గాలు ఉన్నాయి.
5వేల మందికి పైగా ప్రయాణికుల విహారం
ఐకాన్ ఆఫ్ ది సీస్ 5,610 మంది ప్రయాణికులు, 2,350 మంది సిబ్బందిని తీసుకెళ్లేలా రూపొందించారు. ఈ నౌకలో ఉద్యానవనాలు, పార్కులు కూడా ఏర్పాటు చేశారు. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌక 365 మీటర్ల పొడవు, 2,50,800 టన్నుల బరువు ఉంటుంది. ఈ నౌకలో 7 ఈత కొలనులు, 9 వర్ల్ పూల్స్ నిర్మించారు. ఐకాన్ ఆఫ్ ది సీస్‌లో పర్యాటకులు సముద్ర అందాలను తిలకించడానికి వీలుగా 20 డెక్‌లు,8 ప్రాంతాలు ఉన్నాయి.
అక్టోబరులో నౌకాదళంలో చేరనున్న నౌక
2024 అరంగేట్రం కంటే ముందు ఈ ఏడాది అక్టోబర్ 26 వతేదీన రాయల్ కరేబియన్ నౌకాదళంలో చేరడానికి ఈ నౌక ట్రాక్‌లో ఉందని రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల్ బేలీ మీడియాకు చెప్పారు.
సముద్ర ట్రయల్ రన్ పూర్తి
అతి పెద్ద ఓడ సముద్ర ట్రయల్ జూన్ 22వతేదీన పూర్తి అయింది. ‘‘ఐకాన్ ఆఫ్ ది సీస్ నౌక మొదటి సముద్ర ట్రయల్స్ సమయంలో వందల మైళ్లు ప్రయాణించింది. ఈ సమయంలో ప్రధాన ఇంజిన్లు, హల్, బ్రేక్ సిస్టమ్‌లు, స్టీరింగ్, నాయిస్, వైబ్రేషన్ స్థాయిని పరీక్షించాం’’ అని మైఖేల్ బేలీ వెల్లడించారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ యొక్క మొదటి నౌక.
ఏ దీవుల మీదుగా వెళుతుందంటే…టికెట్ ధర ఎంతంటే…
కరేబియన్ దీవులైన బహమాస్, కొజుమెల్, ఫిలిప్స్ బర్గ్, సెయింట్ మార్టెన్,రోబన్, హోండురస్ మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది. ఈనౌకలో వివిధ రకాల ప్యాకేజీ ధరలున్నాయి. ఏడు రాత్రులు ఓడలో ప్రయాణించాలంటే రూ.3 లక్షలరూపాయలకు పైగా ఖర్చు అవుతోంది. మియామీ నుంచి ప్రారంభం కానున్న ఈ విలాసవంతమైన నౌకలో ప్రయాణించేందుకు రికార్డు స్థాయిలో పర్యాటకులు టికెట్లు కొన్నారు. సముద్ర అలలపై విహరించాలనుకునే పర్యాటకులు ఈ నౌకలో ప్రయాణించడం కోసం ఎదురు చూస్తున్నారు.