World’s Happiest Countries : 2024లో ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలివే.. టాప్‌లో ఫిన్‌‌లాండ్.. భారత్ ఎక్కడంటే?

World's Happiest Countries 2024 : అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది మాదిరిగానే భారత్ 126వ స్థానంలో నిలిచింది.

These Are The World's Happiest Countries In 2024, Where India's Rank

World’s Happiest Countries 2024 : ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఏడో సంవత్సరం కూడా ఫిన్లాండ్ అత్యంత సంతోకరమైన దేశంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే సందర్భంగా యూఎస్ ఆధారిత సంస్థ బుధవారం (మార్చి 20న) ‘హ్యాపీనెస్ ఇండెక్స్‌’ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో గత ఏడాది మాదిరిగానే భారత్ 126వ స్థానంలో నిలిచింది.

Read Also :  World’s 3rd Biggest Economy : జపాన్‌ను అధిగమించి ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ.. అతి త్వరలోనే భారత్ కూడా..!

అయితే, పక్క దేశాలైన నేపాల్‌ (93), పాకిస్థాన్‌ (108), చైనా (60), మయన్మార్‌(118) ర్యాంకులతో భారత్ కన్నా సంతోషకరమైన దేశాలుగా ముందంజలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. జీవిత సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతికి సంబంధించిన వ్యక్తుల స్వీయ-అంచనాల మూల్యాంకనంపై హ్యాపీనెస్ ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది. ఈ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో టాప్ 10లోని నార్డిక్ దేశాల్లో ఫిన్‌లాండ్ తర్వాత డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్ దేశాలు తర్వాతి మూడు ర్యాంకుల్లో వరుసగా నిలిచాయి.

అట్టడుగు స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ :
2020లో తాలిబాన్ నియంత్రణలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ సర్వే చేసిన 143 దేశాలలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దశాబ్దం క్రితం ఈ నివేదిక ప్రచురించిన తర్వాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్, జర్మనీలు 20 సంతోషకరమైన దేశాలలో చోటు దక్కలేదు. కానీ, ఈ రెండు దేశాలు వరుసగా 23, 24వ స్థానాల్లో ఉన్నాయి. 12వ ర్యాంకులో కోస్టారికా, 13 ర్యాంకు వద్ద కువైట్ టాప్ 20లోకి ప్రవేశించాయి. సంతోషకరమైన దేశాల జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద దేశాలను చేర్చలేదని నివేదిక పేర్కొంది.

World’s Happiest Countries

టాప్ 10 దేశాలలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే 15 మిలియన్ల కన్నా ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. టాప్ 20లో కెనడా, యూకే మాత్రమే 30 మిలియన్లకు పైగా జనాభాను కలిగి ఉన్నాయి. 2006 నుంచి 2010 మధ్యలో ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జోర్డాన్‌ వంటి దేశాల్లో తీవ్ర క్షీణత నమోదైంది. అయితే, తూర్పు ఐరోపా దేశాలైన సెర్బియా, బల్గేరియా, లాట్వియాల్లో భారీ క్షీణత నమోదైంది.

ఫిన్‌లాండ్ ప్రజల ఆనందానికి కారణాలివే..
ఫిన్‌లాండ్ దేశ ప్రజలు సంతోషంగా ఉండడానికి ప్రకృతితో మమేకం కావడం, సన్నిహిత సంబంధం, హెల్తీ వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ వంటివి ప్రధాన కారణాలుగా యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకురాలు జెన్నిఫర్‌ డీ పావోలా పేర్కొన్నారు. ఫిన్‌లాండ్‌లోని ప్రజలకు ‘విజయవంతమైన జీవితం’ అంటే ఏంటో మంచి అవగాహన ఉందని ఆమె పేర్కొన్నారు. ఉదాహరణకు.. యునైటెడ్ స్టేట్స్‌తో పోలిస్తే.. ఆర్థికంగా ఎదుగుదల ఉంటేనే జీవితంలో విజయం వరిస్తుందని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తారని పరిశోధకురాలు పావోలా పేర్కొంది. అంతేకాదు.. బలమైన సంక్షేమ సంఘం, రాష్ట్ర పాలకులపై విశ్వాసం, తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత వైద్యం, విద్య అనేవి కీలకమని ఆమె పేర్కొన్నారు.

పాత తరం కన్నా యువతరాల్లోనే ఎక్కువ సంతోషం :
ఈ ఏడాది నివేదిక కూడా ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో పాతతరం వారి కన్నా యువ తరాలు సంతోషంగా ఉన్నారని, కానీ, అందరూ కాదని నివేదిక తెలిపింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 2006 నుంచి 2010 మధ్య 30 ఏళ్లలోపు వారిలో ఆనందం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు యువత కన్నా పాత తరాలే చాలా సంతోషంగా ఉన్నారు. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అదే కాలంలో అన్ని వయసులవారిలో ఆనందం గణనీయంగా పెరిగింది. అయితే, పశ్చిమ ఐరోపాలో అన్ని వయసుల ప్రజలు ఒకే విధమైన ఆనందాన్ని నివేదించారు. ఐరోపా మినహా ప్రతి ప్రాంతంలో సంతోషకర స్థాయిలో అసమానత పెరిగిందని నివేదిక వెల్లడించింది.

Read Also :  World’s Biggest Snake : ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ ఎలా ఉందో చూశారా?.. 26 అడుగుల పొడవు, 200 కిలోల బరువు.. వీడియో