Tokyo Olympics: అనిత అరుదైన ఘనత..3 వరుస ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు

వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించి అరుదైన అద్భుతమైన రికార్డు సృష్టించింది అనితా వొడార్జిక్.

Anita Włodarczyk Win 3 Olympics 3 Gold Medals : ఒలింపిక్ క్రీడల్లో ఆడటానికి అర్హత సాధించటం ఓ ఘనత అయితే ప్రతిభ చాటి పతకం గెలవటం మరో ఘనత. ఈక్రమంలో స్వర్ణపతకం గెలవటం అంటే అదొక చరిత్ర అనే చెప్పాలి. అటువంటిది వరుస ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనటమే కాకుండా 3 ఒలింపిక్స్ లోను 3 స్వర్ణ పతకాలు సాధిస్తే ఇక వారి పేరు మారుమ్రోగిపోతుంది.అటువంటి అరుదైన అద్భుతమైన చరిత్రను సృష్టించిందో ఓ మహిళా అథ్లెట్. ఆమే ద గ్రేట్ అథ్లెట్ పోలాండ్‌ ‘అనితా వొడార్జిక్‌’. వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనటమే కాకుండా మూడింటిలోను మూడు బంగారు పతకాలను ఎగరేసుకుపోయింది అనితా వొడార్జిక్.

ఆమె చరిత్రలో భాగంగా టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటింది అనిత వొడార్జిక్. మంగళవారం జరిగిన హ్యామర్‌ త్రో ఈవెంట్‌లో అనితా హ్యామర్‌ను 78.48 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌ క్రీడల అథ్లెటిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో వరుసగా మూడు పసిడి పతకాలు గెల్చుకున్న తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. లండన్‌, రియో, తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ గెలిచి ఈ ఫీట్‌ సాధించింది.

వరుసగా మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో అంటే 2012, 2016, 2020 స్వర్ణ పతకం గెలిచి పోలాండ్‌ క్రీడాకారిణి తన రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టే అవకాశం కూడా లేకుండా అనితా వొడార్జిక్‌ అరుదైన ఘనత సాధించింది. పైగా 35 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించటం అంటే మాటలు కాదు.

ట్రెండింగ్ వార్తలు