సూర్యగ్రహణం సమయంలో నాసా కీలక ప్రయోగం.. మూడు సౌండింగ్ రాకెట్లతో..

గ్రహణం మొదలు కావడానికి సరిగ్గా 45 నిమిషాల ముందు తొలి రాకెట్ ప్రయోగిస్తారు. గ్రహణ సమయంలో రెండో రాకెట్, గ్రహణం ఏర్పడిన 45 నిమిషాల తర్వాత మూడో రాకెట్ ప్రయోగం జరుగుతుంది.

సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి పరిశోధనలు చేయవచ్చు..? ఈ ఖగోళ వింత కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధన సంస్థలు ఎందుకు ఆతృతగా ఎదురుచూస్తాయి..? ఈసారి నాసా ఎలాంటి ప్రయోగాలు చేయబోతోంది..? ఈ సూర్యగ్రహణం పరిశోధనల్లో AI పోషించబోయే పాత్ర ఏంటి..?

ఖగోళ శాస్త్రవేత్తలకు, సంస్థలకు గ్రహణ సమయాలు అత్యంత కీలకమయినవి. ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలతో ఖగోళ విజ్ఞానం కొత్త పుంతలు తొక్కడానికి గ్రహణ సమయాలు ఉపయోగపడతాయి. 1868లో సూర్యగ్రహణాన్ని రికార్డు చేస్తున్న సమయంలోనే హీలియం మూలకాన్ని కనుగొన్నారు. చంద్రగ్రహణం సమయంలో భూమిపై ఏర్పడిన నీడను ఆధారంగా చేసుకుని భూమి ఆకారంపై అప్పటిదాకా ఉన్న నమ్మకాలను చెరిపివేశారు అరిస్టాటిల్. భూమి సమతలంగా ఉండదని, గుండ్రంగా ఉంటుందని.. అసలైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆల్బర్ ఐన్‌స్టీన్ రూపొందించిన సాపేక్ష సిద్ధాంతాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో తీసిన చిత్రంతో ఆర్థర్ ఎడ్డింగ్‌టన్ నిరూపించారు.

అలాగే ఈ సారి ఏర్పడుతున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నాసా అనేక ప్రయోగాల, పరిశోధనల వేదికగా మార్చివేస్తోంది. గ్రహణ సమయంలో మూడు సౌండింగ్ రాకెట్ల ప్రయోగం, సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావం ఉండే ప్రాంతాల్లో జంతువులపై అధ్యయనం, గ్రహణం వల్ల ఐనోస్పియర్‌లో చోటుచేసుకునే మార్పుల అధ్యయనం, కమ్యూనికేషన్ వ్యవస్థలపై గ్రహణ ప్రభావం, 50వేల అడుగుల దూరం నుంచి గ్రహణాన్ని ఫొటోలు తీయడం, ది ఎక్లిన్స్ బెలూన్ ప్రాజెక్టు వంటివి నాసా జాబితాలో ఉన్నాయి.

ఐనోస్పియర్‌పై అధ్యయనం
గ్రహణ సమయంలో భూమిపైన ఉండే వాతావరణంలో కలిగే మార్పులను రికార్డు చేసేందుకు మూడు సౌండింగ్ రాకెట్లను నాసా ప్రయోగిస్తోంది. గ్రహణ ప్రభావం అంతగా లేని వర్జీనియాలోని నాసా బేస్ నుంచి ఈ రాకెట్ల ప్రయోగం జరుగుతుంది. భూ ఉపరితలం నుంచి 420 కిలోమీటర్ల ఎత్తుకు దూసుకువెళ్లే రాకెట్లు తిరిగి నేలను తాకుతాయి. మూడు రాకెట్లను ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో ప్రయోగిస్తున్నారు. గ్రహణం మొదలు కావడానికి సరిగ్గా 45 నిమిషాల ముందు తొలి రాకెట్ ప్రయోగిస్తారు. గ్రహణ సమయంలో రెండో రాకెట్, గ్రహణం ఏర్పడిన 45 నిమిషాల తర్వాత మూడో రాకెట్ ప్రయోగం జరుగుతుంది. అయాన్, ఎలక్ట్రాన్‌లతో భూ ఉపరితలానికి 80 కిలోమీటర్ల ఎత్తులో ఉండో ఐనోస్పియర్‌లో గ్రహణం వల్ల కలిగే మార్పులను సౌండింగ్ రాకెట్లు అధ్యయనం చేస్తాయి. భూ వాతావారణాన్ని అంతరిక్షంతో వేరు చేసి రేడియో తరంగాలు భూ వాతావరణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే ఐనోస్పియర్‌పై అధ్యయనానికి ఈ ప్రయోగం కీలకం.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాతో సూర్యగ్రహణం ఫొటోలు తీయొద్దు.. తస్మాత్ జాగ్రత్త.. నాసా హెచ్చరిక!

అలా‌గే గ్రహణం సమయంలో భూ వాతావరణంలో జరిగే మార్పులను రికార్డు చేసేందుకు ది ఎక్లిప్స్ బెలూన్ ప్రాజెక్ట్‌ను నాసా చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అనేక రకాల పరికరాలు అమర్చిన 600 బెలూన్లను 35 కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్లేలా భూమి నుంచి ఆకాశంలోకి వదులుతారు. వాతావరణ మార్పులపై బెలూన్లకు అమర్చిన పరికరాలు అధ్యయనం చేస్తాయి.

జంతువులు ఎలా స్పందిస్తాయి?
అమెరికాలో గ్రహణం సమయంలో జరిగే మరో ప్రయోగం వన్యప్రాణుల పరిశీలన. టెక్సాస్ రాష్ట్రంలోని జూలలో 20 జంతువులపై గ్రహణ ప్రభావాన్ని అధ్యయనం చేయనున్నారు. ఈ ఎక్లిప్స్ సౌండ్ స్కేప్ ప్రాజెక్టులో జంతువుల ప్రవర్తన-గ్రహణ ప్రభావంపై పరిశీలన జరగుతుంది. సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కలిగే చీకటిని చూసి జంతువులు ఎలా స్పందిస్తాయి.. ఎలాంటి ప్రవర్తన కనబరుస్తాయి అన్నది పరిశీలించనున్నారు. ఇందుకోసం వాటికి దగ్గరగా మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: సంపూర్ణ సూర్యగ్రహణం ఏ టైంలో కనిపిస్తుంది.. ఎంతసేపు ఉంటుంది?

AI పాత్ర కీలకం
గ్రహణ ప్రయోగాల్లో ఈ సారి AI పాత్ర కీలకం కానుంది. ఎక్లిప్స్ మెగా మూవీ పేరుతో నాసా ఓ ప్రయోగానికి ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించేవారు ఫొటోలు తీసి తమకు పంపాలని కోరుతోంది. వేర్వేరు చోట్ల నుంచి వచ్చిన ఫొటోలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషించి సూర్యుని చుట్టూ ఉండే వాతావరణాన్ని నాసా అధ్యయనం చేయనుంది. అనేక రకాల వాయువులతో సూర్యుని చుట్టూ విస్తరించి ఉండే కరోనాను సాధారణంగా చూడలేం. సూర్యుని కాంతి వల్ల కరోనా కనిపించదు. ప్రత్యేక పరికరాలు ఉపయోగిస్తే తప్ప సాధారణ సమయాల్లో కరోనాను శాస్త్రజ్ఞులు చూడలేరు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రం కరోనాను, సూర్యునికి దగ్గరగా ఉండే నక్షత్రాలను సైతం తేలిగ్గా చూడవచ్చు. ఈ ఫొటోలతో పాటు నాసా అధునాతన పరిశోధన విమానాలు మెక్సికో నుంచి గ్రహణం కనిపించే ప్రాంతాల మీదగా ప్రయాణిస్తూ 50 వేల అడుగుల నుంచి తీసే ఫొటోలనూ నాసా విశ్లేషించనుంది.

ట్రెండింగ్ వార్తలు