సంపూర్ణ సూర్యగ్రహణం ఏ టైంలో కనిపిస్తుంది.. ఎంతసేపు ఉంటుంది?

ఖగోళ అద్భుతాల్లో సూర్యగ్రహణం ఒకటి. సంపూర్ణ సూర్యగ్రహణం చూసే అవకాశం చాలా అరుదుగానే వస్తుంది. అలాంటి అవకాశం ఇప్పుడు వస్తోంది.

సంపూర్ణ సూర్యగ్రహణం ఏ టైంలో కనిపిస్తుంది.. ఎంతసేపు ఉంటుంది?

Total Solar Eclipse On April 8: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఐతే ఈ సారి ఏర్పడబోయే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనది.. ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం 54 ఏళ్లకొకసారి మాత్రమే వస్తుంది. గ్రహణ సమయంలో నాలుగు నిమిషాల తొమ్మిది సెకన్లు పాటు గ్రహణ ప్రభావ ప్రాంతాలు పూర్తి చీకట్లోకెళ్లనున్నాయి. ఇది చాలా సుదీర్ఘ సమయం. ఈ సమయంలో నక్షత్రాలు కూడా కనిపిస్తాయి.

అలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది..
ఖగోళ అద్భుతాల్లో సూర్యగ్రహణం ఒకటి. సంపూర్ణ సూర్యగ్రహణం చూసే అవకాశం చాలా అరుదుగానే వస్తుంది. అలాంటి అవకాశం ఇప్పుడు వస్తోంది. ఈ సూర్యగ్రహణం కోసం భారత్‌తో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సూర్యుడికీ, భూమికీ మధ్య చంద్రుడు వచ్చి.. సూర్యుడు కనిపించకపోవడమే సూర్యగ్రహణం. సూర్యుడికీ, భూమికీ చంద్రుడు ఎంత మధ్యగా వస్తాడనే దానిమీద సూర్యగ్రహణం ఆధారపడి ఉంటుంది. ఈ సారి సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు సూర్యుడు పూర్తిగా కనిపించని స్థాయిలో వస్తున్నాడు. అలా సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. పరిమాణంలో సూర్యుడు చంద్రుడు కన్నా 400 రెట్లు పెద్ద. అలాగే చంద్రుడితో పోలిస్తే భూమికి సూర్యుడు 400 రెట్లు దూరంగా ఉంటాడు. 400 రెట్లు ఎక్కువ దూరంలో ఉన్న సూర్యునికి, భూమికి మధ్య, 400 రెట్లు చిన్నగా ఉండే చంద్రుడు వచ్చి.. ఆ సూర్యుణ్ని కనిపించకుండా చేయడంలోనే ఖగోళవింత దాగుంది.

ఆ సమయంలో అక్కడ చీకటి
సంపూర్ణ సూర్యగ్రహణం 4 నిమిషాల 8 సెకన్ల పాటు ఉంటుంది. గ్రహణ ప్రభావం ఉన్న ప్రాంతాలన్నింటినీ ఆ సమయంలో చీకటి ఆవరిస్తుంది. ఎంతలా అంటే పగలు రాత్రిగా మారుతుంది. నక్షత్రాలు సైతం కనిపించే చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. అందుకే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రజలకు అత్యంత అరుదైన అనుభూతిని కలిగిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలంటున్నారు.

సూర్యగ్రహణం ప్రభావం భారత్‌పై ఉండదు
భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల 12 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 2 గంటల 22 నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం కొనసాగుతుంది. హైదరాబాద్‌లోనూ రాత్రి 9గంటల 12 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది. 11.47 గంటలకు సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ప్రతి 18 నెలలకోసారి భూమికి, సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తుంటాడు. ఆ సమయంలో పగలు ఉన్న ప్రాంతాలన్నింటిలో సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది. అలా ఈ సారి సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం భారత్‌పై ఉండదు. అసలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని మనం వీక్షించలేం. మనదేశంతో పాటు ఆసియా ఖండంలో ఎక్కడా సూర్యగ్రహణం కనపడదు.

Also Read: సూర్యగ్రహణం ఫోటోలను ఇలా తీస్తే.. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా దెబ్బతింటుంది జాగ్రత్త.. నాసా హెచ్చరిక!

అలా చూడొచ్చు..
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంపై ప్రారంభమయ్యే సంపూర్ణ సూర్యగ్రహణం ముందుగా మెక్సికో పసిఫిక్ తీరంలో కనిపిస్తుంది. మెక్సికో, అమెరికా, కెనడా, ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం, కరీబియన్ దీవులు, స్పెయిన్, వెనెజులా, కొలంబియా, బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్ దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సూర్యగ్రహణం ప్రభావం ఉంటుంది. అయితే నేరుగా సూర్యగ్రహణాన్ని చూసే వీలులేకపోయినా.. భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. నాసా, టెక్సాస్‌లోని మెక్ డొనాల్డ్ అబ్జర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది.