అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా తమపై పన్నులు విధిస్తే తామూ దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా అన్నంత పనీ చేసింది.సోమవారం(మే-14,2019) 60 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై చైనా టారిఫ్ లను విధించింది. గతంలో ఐదుశాతంగా ఉన్న సుంకాల్లో మార్పులేదని, మిగిలిన ఉత్పత్తులపై 25, 20, 10 శాతానికి పెంచినట్లు చైనా ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది.పెంచిన సుంకాలు జూన్-1,2019 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
గతవారం చైనాతో జరిగిన చర్చలు విఫలమవడంతో 200 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై సుంకాలను 10నుంచి 25శాతానికి అమెరికా పెంచిన విషయం తెలిసిందే. చైనా దిగిరాకపోతే మరో 300 బిలియన్ డాలర్లకుపైగా దిగుమతులపైనా సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు. తమదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోకపోతే చైనా తీవ్రంగా దెబ్బ తింటుందని ట్రంప్ తెలిపారు. వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్ఠంభన ఏర్పడటంతో ఇరుదేశాల అధ్యక్షులు ఫోన్ లో మాట్లాడుకున్నారు. విదేశీ ఒత్తిడికి తలొగ్గేది లేదని, సుంకాలు పెంచినంత మాత్రాన ఎలాంటి సమస్య లేదని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పామని చైనా విదేశాంగ మంత్రి తెలిపారు.