Saudi Arabia: భారతీయ ఉమ్రా యాత్రికులు 42 మంది మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ప్రయాణికుల బస్సు ఢీకొట్టడంతో 42 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో హైదరాబాద్‌కు చెందినవారే అధికంగా ఉన్నట్లు సమాచారం. వారంతా మక్కాలో ఉమ్రా కార్యక్రమాలు పూర్తిచేసుకుని మదీనా వైపు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని బస్సు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మల్లేపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన వారు 16 మంది ఉన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (Saudi Arabia)
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు.
కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు +91 79979 59754, +91 99129 19545 ఏర్పాటు చేయించారు.