Donald Trump : ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. దర్యాప్తు చేపట్టిన ఎఫ్ఏఏ.. అసలేం జరిగిందంటే?
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది.
- Harish Thanniru
- Updated on- August 6, 2026 / 09:25 AM IST
trump marine one flies too close to passenger aircraft faa investigates
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్ ప్రయాణికుల విమానానికి అతి సమీపంలోకి వెళ్లింది. ఆ సమయంలో ఎయిర్ క్రాప్ట్‌లో ట్రంప్ ఉండటం.. మరోవైపు ప్యాసింజర్ విమానం కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈనెల 4న మధ్యాహ్నం ట్రంప్ ప్రయాణిస్తున్న మెరైన్‌వన్ హెలికాప్టర్ వైట్‌హౌస్ నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్ వైపు బయలుదేరింది. అదే సమయంలో ఫ్లోరిడాలోని పెన్సకోలా నగరానికి వెళ్లాల్సిన ఎన్వాయ్ ఎయిర్ ఫ్లైట్ 3742 అనే ప్రయాణికుల విమానం రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయింది.
సాధారణంగా అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రయాణించే సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా వాణిజ్య విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. కానీ, ఈ ఘటనలో ఆ నిబంధన సక్రమంగా అమలు కాలేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో రెండు విమానాల మధ్య ఉండాల్సిన కనీస భద్రతా దూరం తాత్కాలికంగా తగ్గిపోయింది. నిబంధనల ప్రకారం.. రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌ల మధ్య కనీసం 1.5 మైళ్ల అడ్డ దూరం, 500 అడుగుల నిలువు దూరం ఉండాలి. అయితే, ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందితో కమ్యూనికేషన్ సరిగా లేకపోవటం వల్లనే ఇలా జరిగినట్లు సమాచారం. చివరి నిమిషంలో అప్రమత్తమైన ఎయిర్‌ట్రాఫిక్ సిబ్బంది పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) తెలిపిన వివరాల ప్రకారం.. రెండు విమానాల మధ్య భద్రతా దూరంలో స్వల్ప లోపం ఏర్పడినప్పటికీ అవి ఒకదానికొకటి ఢీకొనే పరిస్థితి రాలేదు. అనంతరం రెండూ సురక్షితంగా తమ ప్రయాణాన్ని కొనసాగించాయని అధికారులు తెలిపారు. వైట్ హౌస్ కూడా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి ప్రమాదంలో లేరని స్పష్టం చేసింది.
ఈ ఘటనపై ఎఫ్ఏఏ దర్యాప్తు చేపట్టింది. సమీక్ష జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఏఏ పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇది తీవ్రమైన ప్రమాదం కాకపోయినా, భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశంపై లోతుగా విచారణ కొనసాగుతోంది.
