US China Trade War: చెప్పినట్లే చేసిండు..! చైనాకు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. 104శాతంకు సుంకాలు పెంపు..

అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే చైనాపై భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలను పెంచారు.

Donald Trump Tariffs

US China Trade War: అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగానే చైనాపై భారీ స్థాయిలో ప్రతీకార సుంకాలను పెంచారు. ఫలితంగా అమెరికాకు దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులపై సుంకాలు 104శాతానికి చేరాయి. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. సుంకాలను తగ్గించడానికి మంగళవారం వరకూ గడువు ఇచ్చాము.. చైనా స్పందించకపోతే పెంచిన సుంకాలు బుధవారం (ఏప్రిల్ 9వ తేదీ) నుంచే అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

Also Read: Elon Musk : చైనాతో మనకొద్దు ప్లీజ్.. ఆ టారిఫ్స్ వెనక్కి తీసుకోండి.. ట్రంప్‌‌కు మస్క్ రిక్వెస్ట్..!

డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో భారత్, చైనా సహా అమెరికాకు దిగమతి అవుతున్న పలు దేశాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించాడు. ఈ క్రమంలో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ నిర్ణయంతో చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. చైనా నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యాడు. సుంకాల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మార్చి8వ తేదీ వరకు డెడ్ లైన్ విధించాడు. ఆ సమయంలోగా చైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే చైనా వస్తువులపై 50శాతంకుపైగా సుంకాలను విధిస్తామని హెచ్చరించాడు. ట్రంప్ హెచ్చరికలను చైనా ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ట్రప్ ఆ దేశానికి బిగ్ షాకిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.

Also Read: Elon Musk : 4 నెలల్లోనే అంతా తారుమారు.. భారీగా తగ్గిన మస్క్ సంపద

చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా మరో 50శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో గతంలో 54శాతం సుంకాలకుతోడు ప్రస్తుతం 50శాతం అదనపు సుంకాలతో కలిపి చైనాపై మొత్తంగా సుంకాలు 104శాతానికి చేరుకున్నాయి. అయితే, అమెరికా తాజాగా ప్రకటించిన సుంకాల పెంపుపై చైనా ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఇదివరకు ట్రంప్ హెచ్చరికలను బ్లాక్ మెయిల్ గా అభివర్ణించిన చైనా.. చివరి వరకు పోరాటం చేస్తామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ట్రంప్ నిర్ణయంపై చైనా కూడా దూకుడుగా ముందుకెళ్తే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయమని చెప్పొచ్చు.