అప్పటిదాకా ఆగండి… అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ సంచలన ట్వీట్

ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్‌ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, పోస్టల్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

ప్రజలు సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగే వరకు ఎన్నికలు ఆలస్యం??? అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. పోస్టల్ ఓటింగ్ పెరిగితే మోసపూరితమైన, తప్పుడు ఫలితాలు వస్తాయని అన్నారు. మెయిల్-ఇన్ (పోస్టల్) ఓటింగ్ వల్ల మోసాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్ వాదిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఎన్నికల హిస్టరీ లో 2020 అత్యంత సరికానిది అవుతుంది అని అయన తెలిపారు.


కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోస్టల్ ఓటింగ్‌ను నిర్వహించాలని అమెరికన్ రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్ గట్టిగా నిర్ణయించుకున్నప్పటికీ, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీల గురించి ఆ దేశ రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. అయినప్పటికీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్తుండటం ఆసక్తికర పరిణామం. నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపుతోంది.