మనక్కూడా అవసరమే : ఫోన్ పిచ్చోళ్ల కోసం స్పెషల్ రోడ్  

  • Publish Date - October 4, 2019 / 07:46 AM IST

సెల్ ఫోన్. అందరి తలలు దించుకుని నడిచేలా చేస్తోంది. తలపైకెత్తి పక్కవారితో మాట్లాడటమే కరవైపోయింది. సెల్ ఫోనే ప్రపంచంగా మారిపోయింది. ఈ పిచ్చి ఎక్కడివరకూ వెళ్లిందంటే వారు ఎక్కడ నడుస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇలా సెల్ ఫోన్ చూసుకుంటూ..మాట్లాడుకుంటూ..రోడ్డుపైనా ..రైలు పట్టాలపైనా నడుస్తు వెళ్లి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో జరిగాయి.

ఇటువంటివారి కోసం ప్రత్యేకంగా రోడ్డునే వేశారు. అది ఎక్కడా అనుకుంటున్నారు కదూ. బ్రిటన్ లో. సెల్ ఫోన్ చూసుకుంటూ..మాట్లాడుకుంటూ రోడ్లపై నడిచేవారు బ్రిటన్ లో 75శాతం మంది ఉన్నారని తేలింది. దీంతో సెల్‌ఫోన్‌లో చూస్తూ.. ప్రపంచాన్ని మరిచి నడిచేవారి కోసం ఓ ప‌రిష్కారం కనిపెట్టింది బ్రిటన్.
మాంచెస్టర్‌లోని ఫుల్ రష్ గా ఉండే ప్లేస్ లో మొబైల్‌ ప్రియుల కోసం రోడ్డును నిర్మించారు అధికారులు. పాదచారుల కోసం ‘మొబైల్‌ ఫోన్‌ సేఫ్‌ లేన్స్‌’ పేరుతో 75 మీటర్ల పొడవైన రోడ్డును వేశారు. 
రోడ్డు మీద అటూఇటూ నడిచేవారి కోసం వేర్వేరు గీతలు ఉంటాయి. ఈ రోడ్డుతోనైనా ప్రజలు ఎటువంటి  ప్రమాదాలకు గురవకుండా నడుస్తారనే ఆలోచనతో ఈ రోడ్డును వేశారు. స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఇటువంటి రోడ్డు ప్రతీ దేశంలోను అవసరమే. ఇటువంటి ప్రత్యేక రోడ్లు  చైనాలో కూడా ఉన్నాయి.