Fair Isle : ముగ్గురు విద్యార్థుల కోసం టీచర్ కావలెను..జీతం రూ.57 లక్షలు

ఓ అందాల దీవిలో ఓ స్కూల్. ఆ స్కూల్లో ముగ్గురు అంటే ముగ్గురే విద్యార్ధులు.వారి కోసం ఓ టీచర్ కావాలెను. టీచర్ కు జీతం రూ.57 లక్షలు. ఉండటానికి ఓ ఇల్లు ఇస్తామని ప్రకటన.

scotlands most remote school seeks new headteacher : ఓ అందాల దీవి. ఆదీవిలో జనాభా కేవలం 51. ఆ దీవిలో ఓ స్కూల్ ఉంది.స్కూల్లో ముగ్గురు అంటే ముగ్గురే విద్యార్ధులుంటారు. వారి కోసం ఓ టీచర్ కావాలి. ముగ్గురే పిల్లలు కదా జీతం తక్కువ అని అనుకోవద్దు. సంవత్సరానికి రూ.57 లక్షలు. అంటే నెలకు 4 లక్షల 75 వేలు. ఆముగ్గురు విద్యార్ధులకు పాఠాలు చెప్పటానికి ఓ టీచర్ కావాలని ఆ దీవివాసులు ప్రకటన ఇచ్చారు. మరి ఆ దీవి ఎక్కడుంది?ఆ దీవి విశేషాలేంటో తెలుసుకుందాం..

అది ద గ్రేట్ బ్రిటన్ లోని స్కాట్‌ల్యాండ్‌ లోని ఓర్కనే, షెట్‌ల్యాండ్‌కు మధ్యలో ఉన్న చిన్న దీవి. పేరు ‘ఫెయిర్ ఐల్’. ఈ దీవి విస్తీర్ణం 1,900 ఎకరాలు. ఈ ద్వీపం 1954 నుండి నేషనల్ ట్రస్ట్ ఫర్ స్కాట్లాండ్ యాజమాన్యంలో ఉంది. ఫెయిర్ ఐల్ దీవి యూకే అత్యంత మారుమూల జనావాస ద్వీపం. ఈ దీవిలో కేవలం 51 మంది మాత్రమే నివసిస్తున్నారు. వీరి పిల్లలు చదువుకోసం ఒక స్కూల్ బిల్డింగ్ కూడా ఉంది. ఈ ముగ్గురు స్టూడెంట్స్ మాత్రమే అక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న తరువాత సెకండరీ ఎడ్యుకేషన్ కోసం షెట్‌ల్యాండ్‌‌కు వెళ్తారు. హెడ్ టీచర్ కోసం ప్రకటన ఇస్తూ దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ ఉద్యోగంలో చేరే హెడ్ టీచర్‌ గా జాయిన్ అయితే ఇల్లు కూడా ఇస్తామని తెలిపారు.

ఇప్పుడు ఈ ప్రకటన ఇచ్చారు అంటే..మరి ఇప్పటి వరకూ ఆ పిల్లలకు చదువు ఎవరు చెబుతున్నారు? అనే డౌట్ వస్తుంది. ఇప్పటి వరకూ ఆ స్కూల్లో రూత్ స్టౌట్ అనే టీచర్ వారికి చదువు చెబుతున్నారు. గత 35 ఏళ్లనుంచి ఆమె అక్కడే టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రూత్ వచ్చే అక్టోబర్ లో రిటైర్ కాబోతున్నారు.దీంతో కొత్త టీచర్ కోసం ప్రకటించారు.

‘ఫెయిర్ ఐల్’ దీవిలోని ఈ స్కూల్‌లో చేరే టీచర్‌కు ఏడాదికి 56,787 పౌండ్లు అంటే మన కరెన్సీ ప్రకారం రూ.57,45,042 జీతం. అంతేకాదు ఈ స్కూల్ లో చేరిన టీచర్ కు స్కాట్‌లాండ్ ప్రభుత్వం ఏడాదికి మన భారత్ కరెన్సీలో రూ. 2,29,146 ( 2,265 పౌండ్లు) చొప్పున జీతాన్ని పెంచుతుందని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ స్కూల్‌లో హెడ్ టీచర్‌తోపాటు లెర్నింగ్ సపోర్ట్ అసిస్టెంట్లు కూడా ఉంటారు. టీచర్ క్లాసులు చెబితే.. విద్యార్థులు వాటిని చదివి, అర్థం చేసుకొనేలా చేయడం సపోర్ట్ అసిస్టెంట్ల బాధ్యత.

ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడానికి వెళ్లాలనే కోరిక కలిగిన ఉద్యోగులకు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ విద్యార్దులకు ర్యాంకులు రావాలని ఒత్తిడిచేయరు. ప్రశాంతంగా చదువులు చెబితే సరిపోతుంద. దీనికి తోడు మంచి జీతం.. మరోవైపు కనువిందు చేసే ప్రకృతి అందాలు. ఈ అందాలను చూస్తూ ఎంత కాలం అయినా అక్కడే ఉండిపోవాలనిచేలా ఉంటుంది.

ఎత్తైన కొండలాంటి దీవి సముద్రం మధ్యలో ఈ దీవి ఉంది.పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరంగా ఉన్న ఈ దీవి అరుదైన పక్షులకు ఆవాసం. 27 రకాల పక్షులకు ఈ దీవి నివాసం..ఈ దివి పరిసరాల్లో అరుదైన చేపలు ఉంటాయి. దీంతో ఈ దీవి బాధ్యతలను స్కాట్‌లాండ్ నేషనల్ పార్క్‌కు అప్పగించారు. అయితే, ప్రకృతి అందాలను ఇష్టపడేవారికి ఈ దీవి బాగా నచ్చుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.

2021 అక్టోబర్ లో రిటైర్ అవ్వబోతున్న టీచర్ రూత్ మాట్లాడుతు..నేను 35 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. ఆ పిల్లలు ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు.చాలా బుద్ధిగా ఉంటారని తెలిపారు. ఈ స్కూల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్ధులు తొమ్మిదేళ్ల ఫ్రీజా, ఆరేళ్ల లూకా, మూడేళ్లు ఉన్న అండర్.విద్యార్ధుల కేవలం ముగ్గుర కాబట్టి వారితో వారు చాలా స్నేహంగా ఉంటారు.ఒకరినుంచి మరొకరు నేర్చుకోవటానికి యత్నిస్తుంటారు.పాఠాలను చాలా శ్రద్ధంగా వింటారని తెలిపారు. మా స్కూల్ డిన్నర్‌ కోసం కూరగాయాల్ని మేమే పండిస్తామని తెలిపారు.

1957లో స్కాట్‌లాండ్‌కు చెందిన నేషనల్ ట్రస్ట్ స్వాధీనం చేసుకుంది. షెట్‌ల్యాండ్ నుంచి ఇక్కడికి చేరాలంటే సుమారు 25 మైళ్లు ప్రయాణించాలి. ఈ ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్వ్యూ కూడా ఈ దీవిలోనే ఉంటుంది. వారి ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇల్లు మారేందుకయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఇక ఈ దీవి విషయానికి వస్తే.. ఇక్కడి ప్రజలు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నేరాలకు అవకాశమే లేదు. అంతా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శంగా గడుపుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో పనిచేయడమంటే.. నిజంగా అదృష్టమనే చెప్పుకోవాలి. ఇటువంటి అవకాశం చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. ఇప్పుడా అవకాశం వచ్చింది.మరి ఈ అందాల దీవిలో టీచర్ ఉద్యోగం చేసే అదృష్టం ఎవరికి దక్కుతుందో..

 

ట్రెండింగ్ వార్తలు