Russia-Ukraine War : రష్యాకు తీరని దెబ్బ.. 21 రోజుల్లో నాల్గో మేజర్ జనరల్ మృతి..!

Russia-Ukraine War : యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రష్యా, యుక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం 21 రోజులుగా కొనసాగుతూనే ఉంది.

Ukraine Claims To Kill Another Russian Major General, Fourth Top Officer In 21 Days Of War

Russia-Ukraine War : యుక్రెయిన్‌పై దండెత్తిన రష్యాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రష్యా, యుక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం 21 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరుదేశాల సైనికులు భారీ సంఖ్యలో మృతిచెందారు. వైమానిక దాడుల్లో యుక్రెయిన్ పౌరులతో పాటు ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్ ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యా వేస్తున్న ప్రతి అడుగులో ఆ దేశపు ఆర్మీ అధికారులు ఒక్కొక్కరుగా మృత్యువాతపడుతున్నారు. యుక్రెయిన్ సైన్యం ఇప్పటికే ముగ్గురు టాప్ అఫీసర్లను చంపేసింది.

యుక్రెయిన్ శాంతి చర్చల ప్రతిపాదనలు పంపుతూనే మరోవైపు దేశంపై దాడులు చేస్తున్న రష్యా బలగాలను దీటుగా తిప్పి కొడుతున్నాయి. రష్యా దాడులకు ప్రతిదాడులను చేస్తూ పుతిన్ సైన్యాన్ని యుక్రెయిన్ ముప్పు తిప్పలు పెడుతోంది. అయినప్పటకీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గేది లే అన్నట్టుగా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. 21రోజులుగా కొనసాగుతున్న యుద్ధభూమిలో భయానక దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి. యుక్రెయిన్ సైన్యం ప్రతిదాడుల్లో రష్యాకు చెందిన ప్రధాన ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యాకు చెందిన ముగ్గురు టాప్ మేజర్ జనరల్స్ మృత్యువాతపడగా.. తాజాగా మరో రష్యా టాప్ అధికారి ప్రాణాలు కోల్పోయారు.

రష్యాన్‌ మేజర్‌ జనరల్‌ ఒలేగ్‌ మిత్యేవ్‌ యుక్రెయిన్ సైన్యం దాడుల్లో మృతిచెందినట్టు యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. యుక్రెయిన్ ఖార్కివ్‌లో జరిగిన ఇరుదేశాల సైన్యం దాడుల్లోమిత్యేవ్ ప్రాణాలు కోల్పోయినట్టు యుక్రెయిన్ స్థానిక మీడియా నివేదించింది. రష్యా మేజర్ జనరల్ ఒలేగ్ మిత్యేవ్ 150వ మోటరైజ్డ్ రైఫిల్ డివిజన్‌లో సేవలందించారు. అలాగే యుక్రెయిన్‌తో యుద్ధంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రైఫిల్స్‌ యూనిట్‌లో సైనికులను పరీక్షించడంలో ఆయనకు చాలా అనుభవం ఉంది.

21 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో మిత్యవ్ సహా మొత్తం రష్యాకు చెందిన నలుగురు మేజర్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయారని యుక్రెయిన్ స్థానిక మీడియా తెలిపింది. రష్యా సైన్యంలో మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్, మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవెట్స్కీ, రష్యా దళాల ప్రధాన కార్యాలయం డిప్యూటీ చీఫ్ మేజర్ ఆండ్రీ బుర్లకోవ్ ఖేర్సన్‌లో ప్రాణాలు కోల్పోయారు. రష్యన్ దళాలలో సుమారు 20 మంది జనరల్స్ ఉన్నారని అధికారిక నివేదిక వెల్లడించింది.

Read Also : Russia Ukraine War : పుతిన్ రివర్స్ కౌంటర్.. బైడెన్ సహా 12 మంది టాప్ యూఎస్ ప్రతినిధులపై ఆంక్షలు..!