Ukraine Attack Russia: రష్యాపై యుక్రెయిన్ విరుచుకుపడింది. డ్రోన్లతో భీకర దాడులకు దిగింది. రష్యాలోని 4 వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. యుక్రెయిన్ దాడుల్లో 40కిపైగా రష్యా బాంబర్ ప్లేన్ లు ధ్వంసం అయ్యాయి. తొలుత యుక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా క్షిపణి దాడులు చేసింది. రష్యా జరిపిన దాడిలో 12మంది మృతి చెందారు. 60 మందికిపైగా గాయపడ్డాడు. యుక్రెయిన్ పై రష్యా ఏకంగా 472 డ్రోన్లను ప్రయోగించింది. కాగా రష్యా ప్రయోగించిన 385 డ్రోన్లను అడ్డుకున్నట్లు యుక్రెయిన్ తెలిపింది. రష్యా క్షిపణి దాడులతో యుక్రెయిన్ ప్రతీకార దాడులకు దిగింది.
రష్యాపై ఇంత భారీ మొత్తంలో యుక్రెయిన్ దాడులకు పాల్పడటం ఇదే తొలిసారి. తూర్పు సైబీరియా సరిహద్దులోని సైనిక స్థావరాలే లక్ష్యంగా సుదీర్ఘంగా ప్రయాణించ గలిగే డ్రోన్లను యుక్రెయిన్ ప్రయోగించింది. ఒలెన్యా, బెలయా సహా నాలుగు మిలటరీ ఎయిర్‌బేస్‌లపై దాడులు జరిగినట్లు రష్యా తెలిపింది.
Also Read: వాటే థాట్.. మైండ్ బ్లోయింగ్.. జగన్నాథుడి రథానికి రష్యా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు..
తాము చేపట్టిన ఆపరేషన్‌లో 40కి పైగా రష్యన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ధ్వంసమైనట్లు యుక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఇందులో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్ క్రాఫ్ట్ కూడా ధ్వంసమైనట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇంత భారీ మొత్తంలో యుక్రెయిన్ దాడులకు తెగబడటం ఇదే తొలిసారి.