Ukraine Tension : యుక్రెయిన్‌లో టెన్షన్ టెన్షన్ .. తొలి మరణం నమోదు!

యుక్రెయిన్‌ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ తొలి మరణం నమోదైంది. వేర్పాటువాదుల దాడిలో తూర్పు యుక్రెయిన్‌ లో సైనికుడు మృతి చెందాడు.

Ukraine Tension :  యుక్రెయిన్‌ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ తొలి మరణం నమోదైంది. వేర్పాటువాదుల దాడిలో తూర్పు యుక్రెయిన్‌ ప్రాంతంలో ఓ సైనికుడు మృతి చెండాడు. డొనెస్కీ ప్రాంతంలోని వేర్పాటువాదులను తరిమేసేందుకు యుక్రెయిన్ ఆర్మీ కాల్పుల‌కు దిగింది. మోర్టార్లు, గ్రెనేడ్ లాంచ‌ర్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్స్‌తో విరుచుకుపడింది. వేర్పాటువాదులు కూడా ఫైరింగ్‌తో యుక్రెయిన్‌ ఆర్మీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనలో ఓ యుక్రెయిన్ సైనికుడు మరణించాడు. కాల్పుల ఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడి ప్రజలు రష్యాలోని రోస్టోవ్ ప్రాంతానికి తరలివెళ్తున్నారు. ఇప్పటికే 25వేల మంది రష్యాకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. యుక్రెయిన్ మిలిటరీపై బాంబుల వర్షం కురిసింది. మిలిటరీ ఉన్నతాధికారులు టార్గెట్‌గా బాంబు దాడి జరిగింది. తూర్పు యుక్రెయిన్‌లోని వేర్పాటువాదుల ప్రాంతంలో మిలటరీ అధికారులు పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో వారంతా షెల్టర్​లోకి పరుగులు పెట్టారు. రెబల్​ ప్రాంతంలో జరుగుతున్న హింసను కారణంగా చూపి రష్యా దాడికి పాల్పడే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడుల వెనక రష్యా ఉందంటోంది యుక్రెయిన్.

ఆ దేశమే వేర్పాటువాదులను దాడులు చేసేలా ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తోంది. అయితే రష్యా.. ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. యుక్రెయిన్‌ అంతర్గత వ్యవహారంగా పేర్కొంది. మరోవైపు.. యుక్రెయిన్‌ సైన్యం తమ ప్రాంతాలను బలవంతంగా తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోందంటూ వేర్పాటువాద నాయకులు ఆరోపిస్తున్నారు. తూర్పు యుక్రెయిన్‌కు చెందిన జాయింట్ మిలిటరీ కమాండ్ రష్యా సరిహద్దుకు సమీపంలోని రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో సంఘర్షణ ప్రాంతంలో ఒక సైనికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని యుక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.

 

రష్యాకు అమెరికా మరో వార్నింగ్‌ :
యుక్రెయిన్‌పై రష్యా తప్పుకుండా దాడి చేస్తుందంటున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. దీనిపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తుది నిర్ణయం తీసుకున్నారని చెప్పారు అగ్రరాజ్య అధినేత. కొద్దిరోజుల్లోనే దాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పారు.
యుక్రెయిన్ రాజధాని కీవ్​పైనా దాడి జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే.. యుక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడితే రష్యా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన కార్యాచరణపై పుతిన్ పునరాలోచించుకోవాలని
సూచించారు. యుక్రెయిన్‌పై దాడికి పాల్పడితే.. తాము, మిత్రదేశాలతో కలిసి మునుపెన్నడూ లేని ఆర్థిక ఆంక్షలను విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హెచ్చరించారు.

అంతటితో ఆగకుండా.. పొరుగున నాటోను మరింత బలోపేతం చేస్తామన్నారు. రష్యా ఆర్థిక సంస్థలు, కీలక పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంటామన్నారు కమలా హారిస్‌. రష్యాకు సహకరించేవారినీ వదిలిపెట్టమని పేర్కొన్నారు. రష్యాకు సహకరించి తప్పు చేయొద్దని… కఠిన ఆంక్షలతో పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుందన్నారు. మరోవైపు ప్రస్తుత జర్మనీ పర్యటనలో భాగంగా హారిస్ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో వేర్వేరుగా సమావేశం కానున్నారు.

Read Also : Russia Missile Test: యుక్రెయిన్ కు మరో టెన్షన్, హైపర్ సోనిక్ మిస్సైల్ ను పరీక్షించిన రష్యా

ట్రెండింగ్ వార్తలు