World Map Change : వరల్డ్‌ మ్యాప్‌ను మార్చాల్సిన అవసరమేంటి? కొత్త ప్రపంచ పటంతో ఏం జరగబోతుంది.. ఖండాలు, దేశాల విస్తీర్ణం పెరుగుతుందా..?

World Map Change : ఖండాల అసలు విస్తీర్ణానికి అనుగుణంగా రూపొందించిన ఈ కొత్త ప్రపంచ పటాన్నే వినియోగించాలని సభ్య దేశాలను ఐక్యరాజ్య సమితి కోరింది.

World Map Change

World Map Change : ప్రపంచ పటంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. వందల ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉన్న ప్రఖ్యాత మెర్కేటర్ ప్రపంచ పటానికి బదులుగా.. భూమి ఉపరితలాన్ని మరింత కచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను ఆవిష్కరిస్తూ ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. ఈ కొత్త పటంలో ఆఫ్రికా పరిమాణం పెద్దగా కనిపిస్తుండగా.. యూరప్‌, ఉత్తర అమెరికా సైజు చిన్నగా అయింది. ఐక్యరాజ్యసమితి చేసిన ఈ తీర్మానానికి.. 164 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా మాత్రమే దీనికి వ్యతిరేకించగా.. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి‌.

Also Read : Canara Bank ATM Rules : ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. ఈ బ్యాంకు ATMలో లిమిట్ దాటితే ఛార్జీల మోతే!

ఖండాల అసలు విస్తీర్ణానికి అనుగుణంగా రూపొందించిన ఈ కొత్త ప్రపంచ పటాన్నే వినియోగించాలని సభ్య దేశాలను ఐక్యరాజ్య సమితి కోరింది. మారిటైం నేవిగేషన్‌ కోసం 1569లో గెరార్డస్‌ మెర్కేటర్‌ అనే కార్టోగ్రాఫర్‌.. ప్రపంచ పటాన్ని గీశారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి‌. అప్పట్లో భూభాగాల ఆకృతులు, కోణాలను కచ్చితత్వంతో చూపించడంపైనే దృష్టిపెట్టి ఈ మ్యాప్‌ను రూపొందించారు. ఖండాల పరిమాణాలు మాత్రం అందులో కచ్చితంగా లేవనే వాదన ఉంది.

భూమి గోళాకారంగా ఉండగా.. దాన్ని చదునైన కాగితంపై చూపించాల్సి రావడంతో.. మ్యాప్‌లో భూభాగాల పరిమాణాల్లో కొన్ని వక్రీకరణలు ఏర్పడతాయి‌. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు.. వాస్తవ పరిమాణం కంటే చాలా పెద్దగా కనిపిస్తాయి‌. యూరప్, ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్‌లాంటి ప్రాంతాలు భారీగా కనిపించగా.. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికాలాంటి ఖండాలు తక్కువ పరిమాణంలో కనిపిస్తాయి‌. మెర్కేటర్ మ్యాప్‌లో గ్రీన్‌లాండ్ దాదాపు ఆఫ్రికా అంత పెద్దదిగా కనిపిస్తుంది.

నిజానికి గ్రీన్‌లాండ్ కంటే ఆఫ్రికా విస్తీర్ణం దాదాపు 14 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ వక్రీకరణతో.. ఆఫ్రికా ఖండం వనరులు, జనాభా, ఆర్థిక సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు వాస్తవ పరిమాణంలో ప్రపంచానికి కనిపించడం లేదనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి‌. ఈ సమస్యను అధిగమించేందుకు 2018లో కార్టోగ్రాఫర్ల బృందం ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌ను రూపొందించింది. ఈ మ్యాప్‌లో ఖండాల భూభాగ విస్తీర్ణాన్ని మరింత సముచిత నిష్పత్తిలో చూపించే ప్రయత్నం చేశారు.

కొత్త ప్రొజెక్షన్‌లో ఆఫ్రికాతోపాటు లాటిన్ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియాలాంటి ప్రాంతాలు కూడా మెర్కేటర్ మ్యాప్‌తో పోలిస్తే మరింత పెద్దగా కనిపిస్తాయి‌. భూమి గోళంపై కనిపించే ఆకారాలు, భూభాగాల సాపేక్ష విస్తీర్ణాన్ని సాధ్యమైనంత దగ్గరగా ప్రతిబింబించడమే దీని లక్ష్యం. ఈ తీర్మానాన్నే ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. దీన్ని టోగో ప్రతిపాదించింది. ప్రపంచాన్ని జనాలు ఎలా అర్థం చేసుకుంటారనే విషయంలో మ్యాప్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని ఆ దేశం అంటోంది. ఇక ఈ తీర్మానానికి ఫ్రాన్స్ కూడా మద్దతు తెలిపింది. మెర్కేటర్ ప్రొజెక్షన్‌ను యూజ్‌ చేయమని ప్రకటించింది. అయితే, అమెరికా మాత్రం ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

ఐక్యరాజ్యసమితి నిజమైన అంతర్జాతీయ సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో.. 16వ శతాబ్దానికి చెందిన మ్యాప్ ప్రొజెక్షన్లపై చర్చించడం సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తోందని అమెరికా ప్రతినిధులు విమర్శించారు. అయితే, ఈ తీర్మానం చట్టబద్ధంగా తప్పనిసరి కాకపోయినా.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు ఉపయోగించే మ్యాప్‌ల‌లో మార్పులకు రూట్ క్లియర్ చేస్తుంది.

కొత్త ప్రపంచ పటానికి భారత్ మద్దతు పలికింది. క‌చ్చిత‌త్వంతో కూడిన భూగోళ ప‌టాన్ని రూపొందించేందుకు ప్రవేశ‌పెట్టిన తీర్మానాన్ని స్వాగ‌తిస్తున్నట్లు చెప్పింది. భౌగోళిక స‌మాజాన్ని అర్థం చేసుకోవ‌డంలో మ్యాప్‌లు కీల‌క పాత్ర పోషిస్తాయని.. అందుకే ఈక్వల్ మ్యాప్ ఏరియా ప్రొజెక్షన్స్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఐతే మ్యాప్‌లో మార్పుల కోసం.. ఆఫ్రికన్ యూనియన్ కీలకంగా పనిచేసింది.

మార్చిలో ఏయూ ఈక్వల్ ఎర్త్‌ మ్యాప్‌ను స్వీకరించింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో టోగో తరఫున UN సభ్య దేశాలను కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని కోరారు. తర్వాత UNలో తీర్మానం ముసాయిదా రూపొందించి.. జూలైలో దీనిపై అనధికారిక చర్చలు నిర్వహించారు. ఆఫ్రికా ఇకపై ప్రపంచ పటాల్లో తన అసలు పరిమాణంతో కనిపించాలని పట్టుదలగా కోరుతోంది. భౌగోళికంగానే కాకుండా చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, దౌత్యపరమైన ప్రాధాన్యతల్లోనూ ఆఫ్రికాకు తగిన గుర్తింపు రావాలనేది ఏయూ ప్రతినిధుల డిమాండ్‌.

దాదాపు 450ఏళ్ల తర్వాత ప్రపంచ పటం మారుతోంది. మెర్కేటర్‌ ప్రొజెక్షన్ స్థానంలో ఎర్త్ ఈక్వల్ ప్రొజెక్షన్‌ ఉపయోగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం సూచిస్తోంది. ఈ మ్యాప్‌లో ఆఫ్రికా మరింత పెద్దదిగా కనిపిస్తుంది. గ్రీన్‌లాండ్ గణనీయంగా చిన్నదిగా కనిపిస్తుంది. యూరప్ ప్రస్తుతం కనిపించే దానికంటే చిన్నదిగా.. బ్రెజిల్ మరింత విస్తారంగా కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు మనకు అలవాటైన ప్రపంచ పటంతో పోలిస్తే కొత్త మ్యాప్‌లో ప్రపంచం చాలా భిన్నంగా కనిపిస్తుందన్న మాట. దీన్ని కేవలం భౌగోళిక సవరణగా కాకుండా.. కాగ్నిటివ్ జస్టిస్ చారిత్రక గుర్తింపును పునరుద్ధరించే చర్యగా చూడాలని తీర్మానం తెలిపింది. ప్రస్తుత మ్యాప్‌లోని వక్రీకరణలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా ప్రాంతాల పరిమాణం, అభివృద్ధి సామర్థ్యం, మౌలిక సదుపాయాల అవసరాలు, ఆర్థిక ప్రాధాన్యతపై జనాల అవగాహనను ప్రభావితం చేయవచ్చని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.

మ్యాప్‌ మారితే దేశాల విస్తీర్ణాలు మారిపోతాయా.. మరింత విస్తరిస్తాయా అనే చర్చ జరుగుతోంది. అసలీ మార్పుతో భారత్‌కు ఏంటి అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. ఐతే భారత్‌ సహా చాలా దేశాలు.. మ్యాప్‌లో వాటి అసలు భూభాగ పరిమాణానికి దగ్గరగా కనిపిస్తాయ్‌. మ్యాప్ మారినంత మాత్రాన భారత్ సరిహద్దులు మారవు.. దేశం విస్తీర్ణం కూడా మారదు.. భూమి ఒక్క అంగుళం కూడా పెరగదు. తగ్గదు కూడా ! ఐతే ప్రపంచాన్ని కేవలం గణాంకాల ద్వారానే కాకుండా.. మ్యాప్‌ల ద్వారా కూడా జనాలు అర్థం చేసుకుంటారు.

ఇదేదో కేవలం టెక్నికల్ మార్పులా మాత్రమే కనిపించొచ్చు. అయితే, ఇది అంతకుమించి ! ఐక్యరాజ్య సమితి నిర్ణయం ప్రభావం.. రాబోయే ఏళ్లలో విద్యా రంగంలో ఎక్కువగా కనిపించే చాన్స్ ఉంటుంది. ప్రపంచ భౌగోళిక పరిస్థితులను విద్యార్థులు మ్యాప్‌ల ద్వారా నేర్చుకుంటారు. అందులో దేశాల పరిమాణం, ఒక దేశంతో మరో దేశం మధ్య ఉన్న విస్తీర్ణ తేడాలాంటి విషయాలపై వారికి అవగాహన ఏర్పడుతుంది. కొత్త మ్యాప్‌లను విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభిస్తే.. భవిష్యత్తులో స్కూల్ పుస్తకాల్లో, అట్లాస్‌లలో, విద్యా సామగ్రిలో, ఇతర భౌగోళిక చిత్రాల్లో, దేశాలు, ఖండాలు కొంచెం భిన్నంగా కనిపించే చాన్స్ ఉంటుంది.

ప్రపంచ పటం మారుతుంది కదా.. గూగుల్ మ్యాప్‌, యాపిల్ మ్యాప్స్‌లాంటివి మారిపోతాయా అనే అనుమానం రావొచ్చు. దీనికి అంత ఈజీగా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం నావిగేషన్ కోసం చాలా డిజిటల్ మ్యాప్‌లు.. వెబ్‌ మెర్కేటర్‌ ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తున్నాయ్‌. దాని ద్వారా రోడ్లు, దిక్కులు, మార్గాల్లాంటి వాటిని చూపించడం సులభంగా ఉంటుంది. ఐతే ఐక్యరాజ్య సమితి కొత్త తీర్మానంతో.. టెక్నాలజీ సంస్థలు UN సభ్య దేశాలు, ప్రాంతీయ సంస్థలతో కలిసి మరింత కచ్చితమైన ప్రపంచ పటాలను ఉపయోగించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే అన్ని డిజిటల్ మ్యాప్ సేవలు వెంటనే మారిపోతాయని అర్థం కాదు. వాస్తవంగా కొత్త మ్యాప్‌ను ఎలా, ఎక్కడ అమలు చేస్తారనే అంశంపై ఇంకా తదుపరి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్‌.

మ్యాప్ అంటే.. కేవలం భూమి ఆకారాన్ని చూపించే చిత్రం కాదు.. అది ప్రపంచం గురించి మన ఆలోచనలను కూడా ప్రభావితం చేయగలదు. ఏ దేశం పెద్దది… ఏ దేశం పవర్‌ఫుల్‌. ఏ ప్రాంతం కీలకం.. ఇలాంటి విషయాలపై మన అభిప్రాయాలను మనం చూసే మ్యాప్‌లు కూడా కొంత ప్రభావితం చేస్తాయ్‌. అలాంటిది కొత్త మ్యాప్‌, అక్యురేట్ పటం.. కొత్త మ్యాప్‌.. అన్ని రకాల తేడాలను తగ్గించే అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం క్లియర్‌.. భారత భూభాగం, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలాంటి ఖండాల అసలు వైశాల్యాన్ని, సమతుల్యతను ప్రపంచానికి సరిగ్గా చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాత మ్యాప్‌లు సృష్టించిన భౌగోళిక పొరపాట్లను సరిదిద్దడం ద్వారా విద్యార్థులకు, పరిశోధకులకు ప్రపంచ భూభాగాల అసలు పరిమాణంపై సరైన అవగాహన ఏర్పడుతుంది. అంతర్జాతీయ వేదికపై దౌత్యపరంగా సాంకేతిక తటస్థతను కాపాడుతూనే.. నిజమైన భౌగోళిక స్వరూపానికి మద్దతు తెలిపిన భారత్ వైఖరిని అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.