China : అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా.. సీరియస్‌గా స్పందించిన తైవాన్.. ఎందుకంటే?

చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా అంగీకరించింది.

China-Taiwan Conflict

China-Taiwan Conflict: చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తైవాన్ తమ దేశంలో భాగమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల తమ దేశం చుట్టూ చైనా సైనిక విమానాలు చక్కర్లు కొట్టినట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. తైవాన్ ద్వీపం చుట్టూ తొమ్మిది ప్రదేశాల్లో ఈ విమాన విన్యాసాలు జరిగాయి. ఇదే సమయంలో యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమ దళాలకు పిలుపునిచ్చినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నారు. ఈ క్రమంలో తైవాన్ సైతం చైనా దూకుడును అడ్డుకొనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నరాలు తెగే ఉత్కంఠ.. ఫలితాలను డిసైడ్ చేసేది ఆ ఏడు స్వింగ్ రాష్ట్రాలే..!

చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా అంగీకరించింది. దీంతో అమెరికా తీరును చైనా తీవ్ర స్థాయిలో ఖండించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తైవాన్ కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రకటనలో పేర్కొంది.

 

తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యలను ఆపాలంటూ అమెరికాను చైనా హెచ్చరించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేఖపై తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. చైనా తీరును తీవ్రంగా తప్పుబట్టింది. చైనా బెదిరింపుల నేపథ్యంలో మాతృభూమిని రక్షించుకునే బాధ్యత తమకు ఉందని వెల్లడించింది.