US deported Indians who stayed in country ( Image Source : Google )
US Deport Indians : అమెరికా వెళ్లేందుకు అనేక మంది ప్రయత్నిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యంలో చదువులతో పాటు ఉద్యోగం చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. కొంతమంది కొన్నాళ్ల తర్వాత తిరిగి స్వదేశానికి వస్తుంటే.. మరికొందరు మాత్రం అక్రమంగా అక్కడే నివసముంటున్నారు.
ఇప్పుడు ఇలాంటివారిని అమెరికా నుంచి బహిష్కరిస్తోంది. ఇటీవలే, దేశంలో అక్రమ వలసదారులను నియంత్రించేందుకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ (డీహెచ్‌ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తిరిగి వారి స్వదేశాలకు తిరిగి పంపేస్తోంది.
దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అమెరికా బహిష్కరించింది. భారత ప్రభుత్వ సహకారంతో అమెరికా చార్టర్డ్ ఫ్లైట్‌ను అద్దెకు తీసుకుని మరి అక్రమ వలసదారులను వెనక్కి పంపింది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ చార్టర్ విమానాన్ని అక్టోబర్ 22న భారత్‌కు పంపినట్లు డిపార్ట్‌మెంట్ తెలిపింది.
“అమెరికాలో ఉండటానికి చట్టపరమైన ఆధారం లేని భారతీయులను బహిష్కరించాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులు వెనక్కి పంపేస్తున్నాం” అని హోంల్యాండ్ సెక్యూరిటీ డిప్యూటీ సెక్రటరీ సీనియర్ అధికారి క్రిస్టీ ఎ. కనెగాల్లో పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తూనే ఉంది.
అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రోత్సహిస్తున్న వారిపై కఠినమైన పరిణామాలు ఉంటాయని ప్రకటన పేర్కొంది. జూన్ 2024 నుంచి నైరుతి సరిహద్దుల్లో అక్రమ వలసలు 55 శాతం తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో డీహెచ్ఎస్ లక్ష 60వేల మందిని బహిష్కరించింది. ఈ క్రమంలో భారత్ సహా 145 కన్నా ఎక్కువ దేశాలకు 495 కన్నా ఎక్కువ అంతర్జాతీయ స్వదేశీ విమానాలను నడిపినట్టు ప్రకటన పేర్కొంది.
అమెరికాలో చట్టపరమైన ఆధారం లేకుండా ఉండేవారిని స్వదేశానికి రప్పించేందుకు ఈ విభాగం ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రభుత్వాలతో పనిచేస్తుందని పేర్కొంది. గత ఏడాదిలో డీహెచ్ఎస్ కొలంబియా, ఈక్వెడార్, పెరూ, ఈజిప్ట్, మౌరిటానియా, సెనెగల్, ఉజ్బెకిస్తాన్, చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వలసదారులను బహిష్కరించింది.