US Election 2024
US Election 2024: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ వేళ ఆసక్తికర విషయం చోటు చేసుకుంది. న్యూయార్క్ లోని బ్యాలెట్ పేపర్లలో భారతీయ భాషను కూడా చేర్చారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఇంగ్లీష్ కు అదనంగా మరో ఐదు భాషల్లో బ్యాలెట్లను ముద్రించారు. అందులో ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, కొరియన్ భాషలు ఉండగా.. భారత్ దేశం నుంచి బెంగాలీ భాష ఒకటి. బ్యాలెట్ పేపర్లపై బెంగాలీ భాషను కూడా ముద్రించారు.
భారత్ లో అనేక భాషలున్నప్పటికీ గతంలో కోర్టులో వేసిన ఓ దావా వల్ల ఎన్నికల ప్రక్రియలో బెంగాలీకి చోటు లభించింది. దీంతో న్యూయార్క్ లో నివాసం ఉంటున్న భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అమెరికాలో ప్రచార చట్టాలను ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షిస్తుండగా.. ఎన్నికల ప్రక్రియను మాత్రం ఆయా రాష్ట్రాలు చూసుకుంటాయి. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ సమయం, కౌంటింగ్ ప్రక్రియకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనలను పాటిస్తాయి.
ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా న్యూయార్క్ రాష్ట్రంలోని బ్యాలెట్ పేపర్లలో భారతీయ భాష అయిన బెంగాలీని చేర్చడం భారతీయులు గర్వించదగ్గ విషయమని సోషల్ మీడియాలో భారతీయ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.