iran Israel war
Iran vs Israel war: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచిన అమెరికా.. ఇప్పుడు నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది. అమెరికా మిలిటరీ ఇరాన్ లోని అణుస్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది.
Visuals: Huge US airstrikes on Fordow, Natanz, and Esfahan Iranian nuclear facilities. pic.twitter.com/fSIcAHu3X3
— Black Cobra ⚡ (@Blackcobra00007) June 22, 2025
ఇరాన్ పై దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై అమెరికా దాడులు చేసింది. భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశామని తెలిపారు. విమానాలు సురక్షితంగా అమెరికాకు తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే దేశానికి చెందిన మిలిటరీకి ఇది సాధ్యం కాదు.. ఇప్పుడు శాంతికి సమయం అని చెప్పుకొచ్చారు.
— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025
ఇరాన్ లోని ఫోర్డో అణుకేంద్రం క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుళ్ల చప్పుళ్లు విన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ అణు కేంద్రం ఇరాన్ కు చాలా కీలకమైంది. అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీనిని నిర్మించారు.
ఇదిలాఉంటే.. తమ దేశంలో అమెరికా దాడులు జరిపినట్టు ఇరాన్ అంగీకరించింది. నతాంజ్, ఇస్ఫహాన్‌లో అనేక పేలుళ్లు వినిపించాయిని, ఈ రెండు ప్రాంతాల దగ్గర దాడులు చూశామని ఇస్ఫహాన్ సెక్యూరిటీ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహి చెప్పారు. ట్రంప్ చెప్పిన మూడు ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు ఇరాన్ అధికారులు అంగీకరించారు.
అణుస్థావరాలపై దాడులు చేశామని ట్రంప్ ప్రకటించారు.. ట్రంప్ చెప్పింది వాస్తవమే. అయితే, మాకేమీ పెద్ద నష్టం జరగలేదు. ఎందుకంటే. మేము ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి అన్నింటిని తరలించామని ఇరాన్ ప్రభుత్వ ప్రసార మాధ్యమ డిప్యూటీ పొలిటికల్ డైరక్టర్ హసన్ అబ్దేనీ తెలిపారు. మరోవైపు.. ఇరాన్ పై దాడులకు సంబంధించి అమెరికా ఇజ్రాయెల్ కు ముందస్తు సమాచారం ఇచ్చిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.