నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో గెలిచేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు దిగింది.
గురువారం ఓ రేడియో కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందు వరుసలో నిలిచాయని తెలిపారు. నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ట్రంప్ అన్నారు.
కాగా, అమెరికాలో ఈ సారి అధ్యక్ష ఎన్నికలు సైతం నవంబర్ 3నే జరుగనున్న విషయం తెలిసిందే. .ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు దిగింది.
మరోవైపు, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటగా, ఇప్పటివరకూ 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. గత 24 గంటల్లో అమెరికాలో కరోనాతో 2060 మంది మరణించారు. గత మూడు నెలల్లో (మే 7 తర్వాత) ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. అదేవిధంగా కొత్తగా 58 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 50,32,179 పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఇందులో 22,92,707 యాక్టివ్ కేసులు ఉండగా, 25,76,668 మంది కోలుకున్నారు.