తన మద్దతుదారులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ట్రంప్, కోవిడ్‌ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన ప్రెసిడెంట్

  • Publish Date - October 5, 2020 / 12:50 PM IST

US President Donald Trump surprises: కరోనాతో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌… తన మద్దతుదారులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. కాసేపు కారులో తిరిగిన తర్వాత మళ్లీ హాస్పిటల్‌ లోపలికి వెళ్లారు. దీంతో ట్రంప్‌ ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్‌ పెట్టినట్లైంది. అభిమాన నాయకుడు ఆరోగ్యంగా కనిపించడంతో ఆయన మద్దతుదారులు ఖుషీ అవుతున్నారు. ట్రంప్‌ త్వరలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ధీమాగా ఉన్నారు.

కరోనా నిబంధనలను పట్టించుకోని ట్రంప్:
కరోనా సోకిన తర్వాత కూడా ట్రంప్ తన టెంపరితాన్ని వదిలి పెట్టడం లేదు. కరోనాకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో అభిమానులను పలకరించేందుకు ఆస్పత్రి నుంచి బయటకు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా ప్రోటోకాల్ ప్రకారం… పాజిటివ్ వచ్చిన వ్యక్తి సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూడా ట్రంప్ రూల్స్‌ను బ్రేక్ చేశారు.

వాషింగ్టన్ సమీపంలో ఉన్న వాల్టర్ రీడ్ మిలటరీ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఆస్పత్రి బయట ఉన్న అభిమానులను సర్ ప్రైజ్ చేయబోతున్నానని ముందే ప్రకటించిన ట్రంప్… కొద్దిసేపటికే… ఆస్పత్రి బయట కారులో వెళ్తూ కనిపించారు. పబ్లిక్ హెల్త్ గైడ్ లైన్స్ ను పట్టించుకోకుండా… ట్రంప్ ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నారని డాక్టర్లు విమర్శించారు.