భారతీయ ఐటీ కంపెనీలకు షాక్: H-1B అప్లికేషన్ ఫీజు పెంపు

అమెరికాలో సాంకేతిక నిపుణులైన విదేశీయులు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా అక్కడి ప్రభుత్వం జారీ చేసే హెచ్-1B వీసా అప్లికేషన్ ఫీజు పెంచాలని అమెరికా భావిస్తోంది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణనిచ్చే అప్రెంటిస్ ప్రోగ్రామ్ కు నిధులు పెంచేందుకు గాను హెచ్1బీ వీసా దరఖాస్తుల ఫీజును పెంచాలని నిర్ణయించినట్లు అమెరికా లేబర్ సెక్రటరీ అలెగ్జాండర్ అకోస్టా తెలిపారు. ఈ నిర్ణయంతో అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పడనుంది.

 అక్టోబర్‌-1తో ప్రారంభమయ్యే 2020 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్‌ ను ప్రతిపాదిస్తూ, హెచ్1బీ దరఖాస్తు పత్రాలలో కూడా మార్పులు చేయనున్నట్టు అకోస్టా తెలిపారు. మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, హెచ్1బీ వీసాలను దుర్వినియోగం చేసే కంపెనీల నుంచి అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే దరఖాస్తు ఫీజును ఎంతమేరకు పెంచనున్నదీ, ఏయే క్యాటగిరీల దరఖాస్తుదారులకు దానిని వర్తింపజేయనున్నదీ ఆయన తెలుపలేదు.

 విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉపాధి అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా వారి వేతనాల తగ్గింపునకు కూడా కారణమవుతున్నారన్న నెపంతో ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా నిబంధనలను రోజురోజుకి కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త నిబంధనల కారణంగా గత ఏడాది సగటున ప్రతి నాలుగు దరఖాస్తులలో ఒకదానిని అమెరికన్ అధికారులు తిరస్కరించారు.