To Us Report On 1,000 Chinese Nukes By 2030, Beijing Says Prejudice
US Report – China nuclear weapons : అణ్వాయుధ సంపత్తిపై అమెరికా చేసిన ఆరోపణలను డ్రాగన్ చైనా తిప్పికొట్టింది. అమెరికా రక్షణ శాఖ నివేదికను చైనా తీవ్రంగా ఖండించింది. అసలు అగ్రరాజ్యంతోనే అణు ముప్పు ఉందని ఆరోపించింది. చైనా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ తాజాగా ఓ నివేదిక రిలీజ్ చేసింది. ఈ నివేదికపై స్పందించిన చైనా.. పూర్తి పక్షపాత ధోరణితో నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. పైగా ఈ వ్యవహారాన్ని పెద్దదిగా చేసి చూపెడుతోందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ అన్నారు.
గతంలో మాదిరిగానే అమెరికా రక్షణ శాఖ నివేదిక.. అప్పటి నివేదికల్లోనూ ఇదే వాస్తవాలను విస్మరించిందని విమర్శించారు. చైనా అణు ముప్పు ఉందంటూ ప్రచారం చేయడానికి ఈ నివేదికను అమెరికా అడ్డంపెట్టుకుందని బిన్ ఆరోపించారు. ప్రపంచంలో అణు ముప్పునకు అమెరికానే అతిపెద్ద మూలమని ఆయన ఆరోపించారు. చైనా అమ్ములపొదిలో అణు వార్ హెడ్ సంఖ్య 2027 నాటికి 700కు చేరుకుంటుందని అమెరికా రక్షణ శాఖ నివేదిక అంచనా వేసింది. 2030 నాటికి చైనాలో అణ్వయుధాల సంఖ్య వెయ్యి దాటే అవకాశముందని తెలిపింది.
గతేడాది అంచనా వేసినదానికంటే రెండున్నర రెట్లు అధికంగానే ఉందని అగ్రరాజ్యం వెల్లడించింది. మొత్తంగా డ్రాగన్ చైనా దగ్గర ఇప్పుడు మొత్తం ఎన్ని అణు వార్ హెడ్ ఉన్నాయో వెల్లడించలేదు. గత ఏడాది లెక్కల ప్రకారం పరిశీలిస్తే.. డ్రాగన్ దగ్గర 200కు పైగా అణు వార్ హెడ్ ఉన్నాయని భావిస్తోంది. అమెరికాను తలదన్నే ప్రబల శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతోనే చైనా తన అమ్ములపొదిలో భారీగా అణ్వస్త్రాలను చేర్చుకుంటుందని భావిస్తున్నారు.
Read Also : Petrol Rate : పెట్రోల్ ధరలకు కళ్లెం.. రూ.60కే లీటర్