నెగ్గిన ట్రంప్ పంతం.. సెనేట్‌లో ఒక్క ఓటు తేడాతో బిగ్ బ్యూటిఫుల్ బిల్‌కు ఆమోదముద్ర.. ఇక ఏం జరగనుంది?

ఇప్పుడు ఏం జరుగుతుంది?

Donald Trump

పన్నుల్లో కోత, ఖర్చుల నియంత్రణల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన ‘బిగ్‌ బ్యూటిఫుల్ ట్యాక్స్‌ బిల్లు’కు సెనెట్‌లో ఆమోదముద్ర పడింది. సెనేట్‌లో చర్చ అనంతరం ఓటింగ్‌ జరిగింది. మొదట ముగ్గురు రిపబ్లికన్లు ‘బిగ్‌ బ్యూటిఫుల్ ట్యాక్స్‌ బిల్లు’కు వ్యతిరేకంగా ఓటు వేశారు.

దీంతో 50-50తో ఇది టై అయింది. చివరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ బిల్లు సెనేట్‌లో 51-50 తేడాతో ఆమోదం పొందింది. కాగా, 24 గంటలపాటు జరిగిన చర్చలో ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్లు ఈ బిల్లును వ్యతిరేకించారు.

ఇక ఏం జరగనుంది?
మొత్తం 940 పేజీల ఈ బిల్లు ద్వారా ట్రంప్ తన ప్రధాన లక్ష్యాలను అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే, ఇది అమెరికా రుణాన్ని $3.3 ట్రిలియన్ పెంచుతుందని అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్లు ప్రతినిధుల సభకు వెళ్తుంది. అక్కడ కూడా ఓటింగ్‌లో ట్రంప్‌కు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి.

Also Read: గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్లలో ప్రయాణికులకు వైఫ్ సౌకర్యం!

ట్రంప్ జూలై 4 (స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు)లోపే ఈ బిల్లును తన టేబుల్‌ పైకి పంపాలని డెడ్‌లైన్ పెట్టారు. హౌస్‌లో రిపబ్లికన్లకు 220-212 మెజారిటీ ఉండడంతో పార్టీ సభ్యులపై ఒత్తిడి పెరిగింది.

ట్రంప్ 2017లో ప్రవేశ పెట్టిన వ్యాపార, వ్యక్తిగత పన్ను రాయితీలు ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలవుతాయి. అదనంగా ఓవర్‌టైం వర్కర్స్, సీనియర్ సిటిజన్లకు కొత్తగా పన్ను రాయితీలు లభిస్తాయి. వలసల నియంత్రణకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారు. జో బైడెన్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలలో కొన్ని రద్దు అవుతాయి.

మెడికేడ్, ఫుడ్ అసిస్టెన్స్ ఖర్చుల తగ్గింపు, సామాజిక భద్రతా పథకాలపై ఆంక్షలు వంటివి బిల్లులో ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. సెనేట్ ఇప్పుడు ఆమోదించిన వెర్షన్‌ను.. మేలో హౌస్ ఆమోదించిన బిల్లుతో పోలిస్తే $800 బిలియన్ అదనపు రుణ భారాన్ని తెస్తుంది. ఈ బిల్లు ద్వారా రుణ పరిమితిని $5 ట్రిలియన్ కు పెంచుతారు. దీంతో డిఫాల్ట్ ప్రమాదం తప్పుతుంది.