Elon Musk : అమెరికా టు భారత్.. కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణం.. ఎలన్‌ మస్క్‌ ఫ్యూచర్ ప్లానింగ్ అదిరింది..!

Future Of Ultra-Fast Travel : డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. స్టార్‌షిప్ ఒక ప్రయాణానికి వెయ్యి మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. అంతరిక్షంలోకి వెళ్లకుండా భూమి ఉపరితలంతో సమాంతరంగా కక్ష్యలో ఈ సూపర్ ఫాస్ట్ విమానాలు ఎగురుతాయి.

US To India In 30 Minutes Elon Musk Discusses Future Of Ultra-Fast Travel

Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ గురించే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు వివేక్ రామస్వామితో ప్రభుత్వ సమర్థత విభాగానికి (DOGE) సహ-నాయకత్వం వహించేందుకు మస్క్ సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మక ‘ఎర్త్-టు-ఎర్త్’ అంతరిక్ష యాత్రను టెక్ బిలియనీర్ ప్రకటించారు.

భవిష్యత్తులో అత్యంత వేగంతో దూసుకుపోయే సూపర్ ఫాస్ట్ విమానాలను తీసుకొచ్చేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నాడు. స్పేస్ఎక్స్ వ్యోమనౌకను సూపర్ ఫాస్ట్ విమానంగా మార్చే దిశగా మస్క్ సన్నాహాలు మొదలుపెట్టాడు. ప్రస్తుతానికి ఈ అల్ట్రా ఫాస్ట్ ట్రావెల్ గురించి మస్క్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

స్పేస్‌ ఎక్స్‌ నుంచి ఈ సూపర్‌ ఫాస్ట్‌ విమానాలు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అదేగానీ జరిగితే.. రాబోయే రోజుల్లో అమెరికా నుంచి భారత్‌కు కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. స్టార్‌షిప్ రాకెట్ ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు కేవలం 30 నిమిషాల రికార్డు వేగంతో ఖండాంతర ప్రయాణాన్ని పూర్తి చేయగలదు.

ప్రపంచ దేశాల మధ్య ప్రయాణ సమయాన్ని సాధ్యమైనంత తగ్గించాలనే లక్ష్యంతో మస్క్ ముందుకు సాగుతున్నారు. స్టార్‌షిప్‌ విమానం అందుబాటులోకి వస్తే.. సాధారణ విమాన ప్రయాణ దూరాన్ని దాదాపు 2,200 శాతం తగ్గించవచ్చునని మస్క్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. స్టార్‌షిప్ ఒక ప్రయాణానికి వెయ్యి మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. అంతరిక్షంలోకి వెళ్లకుండా భూమి ఉపరితలంతో సమాంతరంగా కక్ష్యలో ఈ సూపర్ ఫాస్ట్ విమానాలు ఎగురుతాయి. లాస్ ఏంజిల్స్ నుంచి టొరంటో 24 నిమిషాలు, లండన్ నుంచి న్యూయార్క్ 29 నిమిషాలు, ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో 30 నిమిషాలు, న్యూయార్క్ నుంచి షాంఘై 39 నిమిషాల్లో చేరుకోవచ్చు. అమెరికా, చైనా మధ్య విమాన ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య విమానంలో ప్రయాణించేందుకు సుమారు 14 గంటల 50 నిమిషాలు సమయం పడుతుంది.

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) చొరవకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఓ పోస్టు వైరల్ అవుతుంది. ఎలన్ మస్క్ ఈ పోస్ట్‌పై స్పందిస్తూ.. “ఇది ఇప్పుడు సాధ్యమే” అని రాశారు. ప్రజల ఆసక్తి పెరిగేకొద్దీ.. మస్క్ అల్ట్రా-ఫాస్ట్ ట్రావెల్ దృష్టి ప్రపంచ కనెక్టివిటీని మరింత పెంచగలదని పేర్కొన్నారు. కొద్ది నిమిషాల్లో ఖండాలను దాటడం సాధ్యం కానుంది.

Read Also : Best Camera Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నవంబర్‌లో రూ.30వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే!