Jamieson Greer Representative Image (Image Credit To Original Source)
Jamieson Greer: ఇండియా-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ -FTA) జరిగిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణించారు. ఈ ఒప్పందంతో యూరప్‌లోని 27 మార్కెట్లు మన ఆంత్రపెన్యూర్స్‌కు అందుబాటులోకి వచ్చాయి. 15 రంగాలకు సంబంధించిన ఎగుమతుల్లో రూ.6.4లక్షల కోట్ల వరకు అదనపు అవకాశాలు దక్కుతాయి.
ఇండియా-EU మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA)పై US ట్రేడ్ ప్రతినిధి జెమీసన్ గ్రీర్ ప్రశంసల వర్షం కురిపించారు. డీల్‌లోని కొన్ని అంశాలను తాను చదివాను అని తెలిపారు. భారత్ కు అనుకూలంగా కనిపిస్తోందన్నారు. యూరోపియన్ మార్కెట్లో ఇండియాకు విస్తృత అవకాశాలు దక్కుతాయన్నారు. డీల్ అమల్లోకి వచ్చాక భారత్ కి గొప్ప విజయంగా నిలవబోతోందని వెల్లడించారు. భారత వర్కర్లు యూరప్‌కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని జెమీసన్ గ్రీర్ తెలిపారు.
”ఇండియాకు కొన్ని అదనపు వలస హక్కులు ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు కచ్చితంగా తెలియదు. కానీ EU అధ్యక్షుడు (ఉర్సులా) వాన్ డెర్ లేయన్ భారతీయ కార్మికులు యూరప్‌లోకి వెళ్లడం గురించి మాట్లాడారు. కాబట్టి నెట్‌లో, భారతదేశం దీంతో గొప్పగా ఉండబోతోందని నేను భావిస్తున్నాను. వారికి తక్కువ ఖర్చుతో కూడిన శ్రమ ఉంది” అని మిస్టర్ గ్రీర్ అన్నారు.
యూరోపియన్ యూనియన్ తో కుదిరిన FTAని ప్రధాని మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. భారత చరిత్రలోనే ఇది అతి పెద్ద ఒప్పందమని చెప్పారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందన్నారు. ఐదేళ్లలో ఇన్నోవేషన్, డిఫెన్స్ రంగాల్లో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. గ్లోబల్ ట్రేడ్ కోసం IMEC కారిడార్‌ను అభివృద్ధి చేస్తూ అంతర్జాతీయ వ్యవస్థలో స్థిరత్వం కోసం భారత్-EU పని చేస్తాయని ప్రధాని మోదీ చెప్పారు.
ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి జరిగే 97 శాతం ఎగుమతులపై సుంకాలు రద్దు కానున్నాయి. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, రత్నాలు, లెదర్ వంటి రంగాలకు ఇది భారీ ఊతాన్ని ఇవ్వనుంది. యూరప్ కార్లు, యంత్ర పరికరాలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశం సులభతరం అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి సీ ఫుడ్, కెమికల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్.. తెలంగాణ నుంచి టెక్స్‌టైల్స్, ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్ రంగాల ఉత్పత్తులకు లబ్ధి చేకూరనుంది.
Also Read: ప్రపంచం వినాశనానికి మరింత దగ్గరైందా..! డూమ్స్‌డే గడియారం ఏం చెప్పింది.. ఈ వాచ్ గురించి మీకు తెలుసా?