Vadodara Woman : వార్నీ.. పానీపూరీ కోసం ఇదేంది తల్లీ.. నడిరోడ్డుపై రచ్చరచ్చ.. వీడియో వైరల్.. రంగంలోకి పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Vadodara Woman : వడోదరలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పానీ పూరీకోసం ఓ మహిళ రద్దీగా ఉండే రోడ్డుపై ధర్నాకు దిగింది.

Vadodara Woman Protest

Vadodara Woman : పానీపూరీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ గా ఈ పానీపూరీ చాలా ఫేమస్. అయితే, వయస్సుతో సంబంధం లేకుండా పానీ పూరీని లాగించేస్తారు. కొందరైతే సాయంత్రం అయితే, పానీపూరీ తినకుండా ఉండలేరు. తాజాగా.. పానీ పూరీ కోసం ఓ మహిళ నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. తనకు తక్కువ పానీపూరీలు వేశాడని ఏడ్చుకుంటూ రోడ్డుపై బైఠాయించింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అయింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

Also Read: GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వస్తువుల రేట్లు భారీగా తగ్గాయ్.. ఇక నుంచి నెలవారి ఖర్చులో ఉపశమనం..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఈ ఘటన జరిగింది. వీధి వ్యాపారి తనకు రెండు పానీపూరీలు తక్కువ ఇచ్చాడని మహిళ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది. వడోదరలోని సుర్ సాగర్ సరస్సు సమీపంలోని వీధి మధ్యలో కూర్చొని పానీ పూరీ విక్రేతకు వ్యతిరేకంగా మహిళ నిరసన చేపట్టింది.

వీధి వ్యాపారి రూ.20లకు ఆరు పానీపూరీలు ఇస్తానని చెప్పి నాలుగే ఇవ్వడంతో ఆమె రోడ్డుపై బైఠాయించింది. తనకు మిగతా రెండు పానీపూరీలు ఇచ్చే వరకు కదలనని రోడ్డుపైనే కూర్చొంది. అటువైపుగా వచ్చిన వాహనదారులు జాగ్రత్తగా ఆమె పక్క నుంచి వాహనాలు పోనిచ్చారు. కొందరు రోడ్డు పక్కన గుంపుగా చేరి ఆ మహిళ నిరసనను చూడసాగారు.


పానీ పూరీకోసం నడిరోడ్డుపై మహిళ ధర్నాకు దిగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. మహిళకు సర్దిచెప్పి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తనకు రూ.20కి ఆరు పానీపూరీలు ఇప్పించాలని ఆమె ఏడుస్తూ పోలీసులను డిమాండ్ చేసింది. ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి పోలీసులు ఆ మహిళను బలవంతంగా రోడ్డుపై నుంచి తీసుకెళ్లారు.

ఎందుకు రోడ్డుపై నిరసనకు దిగావు అని పోలీసులు ప్రశ్నించగా.. ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకొని.. నాకు రెండు పానీ పూరీలు వస్తాయి.. వాటిని ఇప్పించాలి. లేదంటే అక్కడి నుంచి పానీపూరీ దుకాణాన్ని తొలగించాలని ఆమె డిమాండ్ చేసింది.

మహిళ స్థానికంగా ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ ఇక్కడి పానీపూరీ బండి వద్దకే వస్తాను. గతంలో రూ.20 ఇస్తే ఆరు పానీపూరీలు ఇచ్చేవారు. కానీ, ఇటీవల నుంచి రూ.20కి కేవలం నాలుగు పానీపూరీలు మాత్రమే ఇస్తున్నాడు. ఇదేమని అడిగితే దాదాగిరి చేస్తున్నాడని దుకాణం దారుడిపై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. కచ్చితంగా రూ.20కి ఆరు పానీపూరీలు ఇవ్వాలి.. లేదంటే ఇక్కడి నుంచి పానీపూరీ బండిని తీసేయించాలని ఆ మహిళ డిమాండ్ చేసింది. చివరికి పోలీసులు ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.