Volkswagen: ఆటోమొబైల్ రంగంలో భారీ షాక్.. ఫోక్స్‌వ్యాగన్ లో లక్ష ఉద్యోగాల కోత.. నాలుగు ప్లాంట్లు క్లోజ్
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్(Volkswagen) లక్ష మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు, నాలుగు ప్లాంట్లను మూసివేయాలని ప్రణాళికలు రచిస్తోంది.
- V Santhosh Kumar
- Published on- June 26, 2026 / 07:47 PM IST
Volkswagen to shut down 4 plants and layoff one lakh employees
- ఫోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాల కోత.
- నాలుగు పెద్ద ప్లాంట్లు మూసివేత.
- కార్మిక సంఘాల తీవ్ర వ్యతిరేకత.
Volkswagen: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు, నాలుగు ప్లాంట్లను మూసివేయాలని కంపెనీ సీఈవో ఒలివర్ బ్లూమ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో 6.67 లక్షల మంది పనిచేస్తుండగా, తాజా ప్రణాళిక ప్రకారం మొత్తం సిబ్బందిలో 15 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సీఈవో ప్రతిపాదించిన ‘2030 గ్రూప్ టార్గెట్ పిక్చర్’లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులను సైతం 15 శాతం మేర కుదించాలని యాజమాన్యం భావిస్తోంది.
నాలుగు ప్లాంట్ల మూసివేత.. కారణాలు ఇవే:
ఉద్యోగాల తొలగింపుతో పాటు జర్మనీలోని హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్‌లతో పాటు ఆడికి చెందిన నెక్సార్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ చూస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీకి అవుతున్న భారీ ఖర్చులు, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్లు, ముఖ్యంగా చైనా ఆటోమొబైల్ మార్కెట్ నుండి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికే కంపెనీ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ సంస్థకు చెందిన ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ, డుకాటీ వంటి టాప్ బ్రాండ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికలను సిద్ధం చేశారు.
కార్మిక సంఘాల తీవ్ర వ్యతిరేకత:
యాజమాన్యం తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయాలపై ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen)వర్క్స్ కౌన్సిల్, ఐజీ మెటల్ యూనియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దశాబ్దం పాటు ఏ ఒక్క ప్లాంటూ మూసివేయబోమంటూ గతంలో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా కంపెనీ నడుచుకుంటోందని, ఈ చర్యలను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించాయి. ప్రస్తుతం యాజమాన్యం తొలి విడతగా 50 వేల మందిని తొలగించాలని చూస్తున్నప్పటికీ, రానున్న రోజుల్లో కార్మిక సంఘాల నుండి కంపెనీ భారీ స్థాయిలో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు. వచ్చే నెల జరిగే సూపర్‌వైజరీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
