Waterless washing machines
Waterless washing machines: నీళ్లు లేకుండా బట్టలు ఉతకగలమా..? అదెలా సాధ్యం అనే డౌట్ మీకువచ్చే ఉంటుంది. కానీ, అది సాధ్యమే. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో నీళ్లు లేకుండా, ఎలాంటి వాషింగ్ పౌడర్లు వాడకుండా బట్టలను ఉతికేసే మెషీన్లు వచ్చేస్తున్నాయి. వాటిని వాడుతున్నారు కూడా.
పట్టణాలతోపాటు పల్లెల్లోనూ ఎక్కువ మంది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్లు వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్కసారి బట్టలు ఉతకాలంటే 30 నుంచి 40 లీటర్ల నీళ్లు సరిపోతాయి. మామూలుగా బట్టలు ఉతకడంతో పోలిస్తే నీటి వినియోగం కాస్త తక్కువే. అయితే, రానురాను నీటి కొరత తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు కూడా నీరు కరువవుతోంది. ఇలాంటి సమయంలో నీటితో ప్రమేయం లేకుండా బట్టలు ఉతికే మెషీన్లు అందుబాటులోకి వస్తే అంతకుమించిన సంతోషం మరొకటి లేదు.
నీటి ప్రమేయం లేకుండా బట్టలను వాష్ చేసే మెషీన్లు ప్రస్తుతానికి యూఎస్, యూకే, జపాన్ వంటి దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. ముఖ్యంగా హోటళ్లు, ఆస్పత్రుల వంటి చోట్ల వినియోగిస్తున్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగించడం ఇంకా మొదలు కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా పలు వాషింగ్ మెసీన్ల బ్రాండ్లు వీటిని పరీక్షిస్తున్నాయి. భారతదేశంలో ఇలాంటి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. ఇప్పటి వరకు ఇలాంటి మెషీన్లు మనం దేశంలో వాడుకలో లేవు.
వాటర్ లేకుండా బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్లు ఎలా పనిచేస్తాయంటే.. మూమాలు వాషింగ్ మెషీన్ల కంటే ఇది పెద్దగా ఉంటుంది. ఇందులో కార్బన్ డై ఆక్సైడ్ గ్యాస్ రూపంలో ఉంటుంది. దుస్తులను నిర్దేశిత చాంబర్ లో వేసి స్విచ్ ఆన్ చేయాలి. అప్పుడు గ్యాస్ రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ద్రవరూపంలోకి మారి బట్టలకు ఉన్న మురికిని వదిలిస్తుంది. బట్టలు ఉతకడం పూర్తయిన తరువాత ఆ ద్రవం తిరిగి గ్యాస్ రూపంలోకి మారిపోయి పునర్వినియోగానికి సిద్ధంగా ఉంటుంది. నీటి వినియోగం లేనందున బట్టలు మళ్లీ ఆరబెట్టాల్సిన అవసరం లేదు. బట్టలు ఉతకడం పూర్తయిన తరువాత పొడిగానే బయటకు వస్తాయి.