No Hilsa From Bangladesh For Bengalis in India This Durga Puj
Bangladesh Hilsa Ban : భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో ప్రతి ఏడాది దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. ప్రత్యేకించి నవరాత్రుల సందర్భంగా బెంగాల్‌లో ప్రత్యేక వంటకాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి. సాధారణంగా పండుగ అనగానే అనేక రకాల పిండి వంటలు దర్శనమిస్తుటాయి. కానీ, బెంగాల్ నవరాత్రుల్లో మాత్రం హిల్సా చేప ఉండాల్సిందే. ఈ హిల్సా చేపకు అంత ప్రత్యేకత ఉంది. ఈ హిల్సా చేప మనదగ్గర దొరకదు. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేస్తారు. ప్రతి ఏడాదిలా కాకుండా ఈ ఏడాది మాత్రం బెంగాల్ ప్రజలకు హిల్సా చేపలు దక్కేలా కనిపించడం లేదు.
ఎందుకంటే.. ఈ దుర్గాపూజకు హిల్సా చేపలను భారత్‌కు దిగుమతి చేసేది లేదని బంగ్లా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచంలోని అత్యంత ఉత్తమైన రకాల చేపల్లో హిల్సా చేప రకం ఒకటి. ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ మధ్య ముల్లులా మారింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపలను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించడమే ఇందుకు కారణం.
అయితే, దుర్గాదేవి పూజ జరిగే రోజుల్లో ఈ హిల్సా చేపకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. బెంగాలి ప్రజలు ఈ చేపను దుర్గామాతకు నైవేధ్యంగా సమర్పిస్తారు. పద్మ నదిలో కనిపించే బంగ్లాదేశ్ రకం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా చెప్పవచ్చు. ప్రపంచంలోని హిల్సా నిల్వల్లో 70 శాతం బంగ్లాదేశ్‌లోనే ఉంది.
మేం కూడా దుర్గాపూజ జరుపుకుంటాం :
బంగ్లాదేశ్ ఫిషరీస్ మంత్రి ఫరీదా అక్తర్ మాట్లాడుతూ.. “ బెంగాలీ ప్రజలకు క్షమాపణలు.. ఇకపై, హిల్సా చేపలను భారత్‌కు పంపలేం. ఇది ఖరీదైన చేప. మా దేశ ప్రజలు హిల్సాను పొందలేకపోతున్నారని గమనించాం. ఎందుకంటే అన్నీ భారత్‌కు వెళ్తున్నాయి. మిగిలి హిల్సా చేపలు మా ప్రజలకు చాలా ఖరీదైనవిగా మారాయి. మా దేశంలో మేం కూడా దుర్గాపూజ జరుపుకుంటాం. మా ప్రజలు కూడా హిల్సా చేపలను ఆశ్వాదించవచ్చు’’ అని అన్నారు.
బంగ్లాదేశ్‌లో హిల్సాకు విపరీతమైన డిమాండ్, నిషేధం ఉన్నప్పటికీ, మాజీ ప్రధాని షేక్ హసీనా, దుర్గాపూజకు ముందు భారత్‌కు కనీసం 4వేల టన్నుల హిల్సా లభిస్తుందని హామీ ఇచ్చారు. దీన్ని ఫరీదా అక్తర్ విమర్శించారు. “ఇది అవసరం లేదు. ఆమె ఇలా చేసి ఉండకూడదు. కేవలం భారత్‌తో సత్సంబంధాల కోసం బంగ్లాదేశ్ ప్రజల అవసరాలపై రాజీ పడ్డారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న ఈ కాలంలో ఇది చాలా అవసరమని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తీస్తా సమస్యను వెంటనే పరిష్కరించాలి :
ఈ సమయంలో భారత్ సమస్యగా ఉండకూడదు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చాలని కోరుకుంటున్నాం. ఇవి చేపలు మాత్రమే కాదు. తీస్తా నీటి ఒప్పందం సమస్య కూడా. భారత ప్రభుత్వం ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నాను. మా దౌత్య బంధం హిల్సా అయితే ఎగుమతులు లేకుండా ప్రభావితం అయ్యేంత పెళుసుగా ఉండాలని నేను అనుకోను. భారత్ పరిస్థితులు మెరుగుపడాలని కోరుకుంటే.. తీస్తా సమస్యను పరిష్కరించాలి’’ అని బంగ్లా మంత్రి ఫరీదా పేర్కొన్నారు.